హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

నాట్యకళాతృష్ణ.. నటరాజ రామకృష్ణ

నాట్యకళాతృష్ణ.. నటరాజ రామకృష్ణ
ఏ ఇతర దేశీయ నృత్య రీతులకు తీసిపోని ఔన్నత్యం కలిగిన ఆంధ్ర నాట్యాన్ని పునరుజ్జీవింప చేయాలన్నదే లక్ష్యమని, అంతకు మించి వ్యక్తిగతంగా ధన సహాయం కానీ… ఏ ఇతర మణిమాణిక్యాలతో పనిలేదని అంటారాయన…నాట్యం తన ఆరవ ప్రాణంగా కాకతీయుల కాలంలో కనుమరుగయిన పేరిణి శివతాండవ నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన నాట్యగురువు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ. దేవాలయాలు ఉన్నంత కాలం ఆంధ్ర నాట్యం జీవిస్తూనే ఉంటుందని, దాని గొప్పదనాన్ని గుర్తించి రేపటి తరానికి ఈ కళ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలంటారు. లస్యంగా అయినా ఇటీవలే ఆయనకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ లభించడం విశేషం.

NATARAJA_RAMAK2డాక్టర్‌ నటరాజ రామకృష్ణ్ణ ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవం, నవజనార్ధనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని మళ్లీ వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుప్రసిద్ధ నాట్యాచార్యులు. ఆంధ్రనాట్యము ఒక పురాతన లాస్య నర్తనం. 10వ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే పేరిణి శివతాండవం ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన నవజనార్ధనం గత 400 ఏళ్ళుగా తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంలోని కుంతీమాధవ మందిరంలో ప్రదర్శింపబడుతోంది.

పువ్వుపుట్టగానే: నటరాజ రామకృష్ణ 21 మార్చి, 1933లో కళాకారుల వంశంలో జన్మించారు. ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణలో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నారు. వారిలో మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తి, శ్రీమతి నాయుడుపేట రాజమ్మ, పెండెల సత్యభామ వంటి వారు ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర కల్యాణం, కుమార సంభవం, మేఘ సందేశం వంటి నాట్య ప్రదర్శనలు ఆయనకు ఎంతో పేరుతెచ్చాయి. ఉజ్జయినిలో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి స్వర్ణకలశం లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన 40కి పైగా పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర, ఆంధ్రులు – నాట్యకళారీతులు వంటివి ప్రసిద్ధ గ్రంథాలు. ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీకి ఒకప్పుడు చైర్మన్‌గా ఉండిన డాక్టర్‌ నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు నడిపిస్తున్నారు. ఆంధ్రనాట్యానికి ప్రత్యేకమైన సాత్వికాభినయము చేయడంలో డాక్టర్‌ నటరాజ రామకృష్ణ ఉద్ధండులు.

NATARAJA_RAMAKనటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ‘నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం’ సంస్థను నెలకొల్పారు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛన్‌ అందజేస్తున్నారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి. ఆ మధ్య ఆయన శిథిలమవుతున్న హైదరాబాదులోని తారామతి మందిరము, ప్రేమావతి మందిరాలను బాగు చేయించారు. ఒకప్పుడు తారామతి, ప్రేమావతులు గోల్కొండ నవాబు, కుతుబ్‌ షాహి ఆస్థాన నర్తకీమణులు.

భరతనాట్యం, కూచిపూడి ఒకరకంగా అన్ని భారతీయ నృత్య సంప్రదాయాలను ఆకళింపు చేసుకొన్న భరత కళాప్రపూర్ణుడు నటరాజ రామకృష్ణ. తెలుగువారి సంస్కృతికి దర్పణమైన ఆంధ్ర నాట్యాన్ని పునరుద్ధరించి ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రచారం చేసిన కారణజన్ముడు అనవచ్చు. పుట్టింది తూర్పున బాలీ దీవులలో, తెలుగు సంప్రదాయ కుటుంబ వాతావరణంలో. కానీ నాడు నృత్యం అభ్యసించడమే మహాపరాధంగా భావించే ఆ రోజులలో నృత్యాభిలాషతో తల్లిదండ్రుల అనుమతి లేకుండా రామకృష్ణ మాతృదేశానికి రావటం ఆయన జీవితంలో ఒక మలుపుగా భావించవచ్చు. బాల్యమంతా మద్రాసు రామకృష్ణ మఠంలో గడిపి అనంతరం గాంధీ ఆశ్రమంలో పెద్దలు ప్రభాకర్‌.జి, ఆశాదేవి మొదలైన వారితో పరిచయాలు ఆయన జీవన విధానానికి సోపానాలైనాయి.

NATARAJA_RAMAK1 భరతనాట్యం, కూచిపూడి నాట్యంలోని అతిరథ మహారథులైన మీనాక్షి సుందరం పిళ్లె, వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్ర్తి, నాయుడుపేట రాజమ్మ, ఆలయ నృత్యంలో ప్రసిద్ధురాలైన పెండ్యాల సత్యభామల శిక్షణలో విభిన్న సంప్రదాయ నృత్యరీతులను ఆకళింపు చేసుకున్నారు. తంజావూరు రాజ ఆస్థానం అతిథుల పరిచయంతో రామకృష్ణ తంజావూరు వెళ్ళటం …అక్కడే తెలుగు భాష ఔన్నత్యాన్ని సాహిత్య సంపదను, శిలాశాసనాల సమగ్ర సమాచారాన్ని తంజావూరు సరస్వతి గ్రంథాలయంలో పరిశీలించటం ఆయన నాట్య జీవితంలో మరో మలుపు. 15 ఏళ్ళ వయస్సులోనే నాట్య గ్రంథాలు రాయడం మొదలుపెట్టి, ఇప్పటివరకు తన కలం నుండి 41 నాట్య గ్రంథాలను రచించటం ఆయనను బహు గ్రంథకర్తగా పేర్కొనవచ్చు. దక్షిణ భారత నృత్య రీతుల, నర్తన బాల, డ్యాన్సింగ్‌ బెల్స్‌ పుస్తకాలకు కేంద్ర, రాష్ట్ర పురస్కారాలు కూడా లభించాయి. డ్యాన్సింగ్‌ బెల్స్‌ ఇంగ్లీష్‌ రచన స్వర్గీయ పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆయన సమ్మతితో అంకితమివ్వటం మధురమైన స్మృతిగా రామకృష్ణ తెలియజేశారు.

ఆంధ్ర నాట్యం నాలుగు భాగాలను విడుదల చేయాలని సంకల్పించిన రామకృష్ణ తాను రచించిన పుస్తకాలన్నింటిని పునర్ముద్రణ, అలాగే ఇతర భారతీయ భాషల్లో అనువదింపచేస్తే నృత్య శిక్షకులకు, నృత్యప్రియులకు అందరికీ ఉపయోగంగా ఉంటాయని భావిస్తున్నానని అన్నారు. ఇవేకాక వివిధ దిన, వార పత్రికలలో కూడా అసంఖ్యాకంగా రచనలు చేసి మన నాట్య తీరుతెన్నులపై విమర్శనాత్మక వ్యాసాలతో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞావంతులు నటరాజ రామకృష్ణ. నాట్యరంగ తృష్ణ్ణతో దేశమంతా పర్యటించి మన నాట్య రంగం రీతులను, తీరుతెన్నులను కూలంకషంగా పరిశీలించిన పరిశోధక కళాతపస్వి రామకృష్ణ.. హిందీ, సంస్కృతం దక్షిణాది నాలుగు భాషలలో అనర్గళమైన పాండిత్యం కల్గినవాడు కూడా. మన రాష్ట్రంలో హైదరాబాద్‌ను స్థిరనివాసంగా ఏర్పరచుకుని నృత్య నికేతన్‌ సంస్థ ద్వారా 50 ఏళ్ళుగా వేల సంఖ్యలో నృత్య విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత రామకృష్ణకే చెందుతుంది. ఆంధ్ర నాట్య కళాకారులుగా ప్రసిద్ధులైన కళాకృష్ణ, పేరిణి రమేష్‌, వెంకటేష్‌ మరెందరో ఆయన శిష్యులు. ఒకవిధంగా ఆయన ఆంధ్ర నాట్యానికి వటవృక్షంగా పేర్కొనవచ్చు. బిరుదులు, సత్కారాలు లెక్కలేనన్ని, అందులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ సత్కారం ప్రముఖంగా పేర్కొనవచ్చు.

అవార్డులు, పురస్కారాలు
నటరాజ బిరుదు ఆయన 18వ ఏట, రాజా గణపతి రావు పాండ్యచే ప్రదానం చేయబడింది. భారత కళాప్రపూర్ణ బిరుదు 1968లో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ వారిచే.

భారతకళా సవ్యసాచి బిరుదు 1979లో పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘంచే ఇవ్వబడింది. కళాప్రపూర్ణ బిరుదు 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి, కళాసరస్వతి బిరుదు 1982లో హైదరాబాదులోని కళావేదిక ద్వారా ఇవ్వబడ్డాయి. దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడుగా 1984లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా ఇవ్వబడింది. 1986 లో ఎల్‌.వి.ఆర్‌. ట్రస్ట్‌, మద్రాసు నుండి – పేరిణీ శివతాండవంపై పరిశోధనకుగాను ఉత్తమ పరిశోధకునిగా పురస్కారం అందుకున్నారు. 1980 శ్రీశైలం దేవస్థానం తరపున ఆస్థాన నాట్యాచార్యునిగా ఉన్నారు.అలాగే 1980 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన ఆస్థాన నాట్యాచార్యునిగా వ్యవహరించారు.

1985 లో ఆంధ్రప్రదేశ్‌ కళాప్రేమికులు ఆయనకు స్వర్ణకిరీటాన్ని బహూకరించారు. 1991లో శ్రీ రాజాలక్ష్మీ పురస్కారం,95లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ అవార్డ్‌ మరియు భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1999లో కళాసాగర్‌ అవార్డ్‌ అందుకున్నారు.

2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తరపున విశిష్ట పురస్కారం అందుకున్నారు.

Surya Telugu Daily.

మార్చి 11, 2011 Posted by | నాట్యం | , | వ్యాఖ్యానించండి