హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

లక్షలాది గొంతుకుల శంఖారావం అన్నా హజారే

లక్షలాది గొంతుకుల శంఖారావం అన్నా హజారే
అన్నా హజారే…అవినీతిపై సమర శంఖాన్ని పూరించిన సంఘ సంస్కర్త. ఇందు కోసం లోక్‌ పాల్‌ బిల్లు స్థానంలో జన్‌ లోక్‌పాల్‌ బిల్లును ఏర్పాటుచేయాలని మంగళవారం నుంచి ఆమరణనిరాహార దీక్ష చేస్తూ యుపిఎ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న వ్యక్తి. దేశంలో ఎంతటి పెద్దవారైనా సరే అవినీతికి పాల్పడితే వారిని విచారించే అధికారం జన్‌లోక్‌పాల్‌కు కల్పించాలని ఆయన ఉద్యమిస్తున్నారు. ఆయనకు మద్దతుగా సంఘ సంస్కర్త స్వామి అగ్నివేష్‌, మాజీ ఐపిఎస్‌ అధికారిణి కిరణ్‌బేడితో పాటు పలువురు మద్దతుపలికారు. గాంధేయ పద్దతిలో ఆయన చేస్తున్న సత్యాగ్రహం దేశంలోని అందరినీ కదిలించింది. నాలుగు రోజులుగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆయనకు మద్దతుగా ఆందోళనలు చేపడతున్నారు.

annaఅన్నా హజారే మహారాష్టల్రోని అహ్మద్‌నగర్‌ జిల్లాలోని రాలేగన్‌ సిద్ధి అనే గ్రామాన్ని మోడల్‌ గ్రామంగా తీర్చిదిద్ది ఎంతో పేరుతెచ్చుకున్నారు. దీంతో ఆయన దేశ,విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచారు. ఆయన కృషిని గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ఇచ్చి సన్మానించింది.

కుటుంబ నేపథ్యం…
సంఘ సంస్కర్త కిసాన్‌ బాపట్‌ బాబురావు హజారేను ప్రజలందరూ అన్నా హజరేగా పిలుస్తారు. ఆయన 1949 సంవత్సరం జనవరి 15న బింగర్‌ గ్రామంలో జన్మిం చారు. బాబురావు హజారే, లక్ష్మిభాయ్‌ దంపతులకు ఆ యన పుట్టారు. తల్లిదండ్రులు కార్మికులుగా పనిచేస్తుం డేవారు. అన్నా హజారేకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. పరిస్థితులు బాగా లేకపోవడంతో అన్నా హజారే కుటుంబం 1952లో రాలేగన్‌ సిద్ది గ్రామానికి తరలి వెళ్లింది. ఆ తర్వాత ఆయన ముంబయ్‌లోని తన అత్త వద్ద ఏడవ తరగతి వరకు చదువుకొని కొన్ని పరిస్థితుల మూలంగా మధ్యలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది.

దేశ సైన్యంలో పనిచేసి…
anna3 హజారే తన ఉద్యోగ జీవితాన్ని ఇండియన్‌ ఆర్మీలో డ్రైవర్‌గా ప్రారంభించడం విశేషం. తీరిక సమయాల్లో ఆయన స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావే వంటి ప్రముఖుల పుస్తకాలను చదివి ప్రభావితులయ్యారు. దీంతో ఆయన సంఘ సంస్కర్తగా, ఉద్యకారునిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 1965లో జరిగిన ఇండో-పాకిస్తాన్‌ యుద్దం సమయంలో డ్రైవర్‌గా ట్రక్‌ను నడుపుకుంటూ సరిహద్దులకు వెళ్లి సురక్షితంగా బయటకు వచ్చారు. 1970 దశకం మధ్య సమయంలో ఆయన డ్రైవింగ్‌ చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.

రాలేగన్‌ సిద్ది గ్రామంలో…
సైన్యంలో కొంతకాలం పనిచేసిన తర్వాత అన్నా హజారే అక్కడ వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. అనంతరం 1975లో తన స్వగ్రామం రాలేగన్‌ సిద్దికి తిరిగి వచ్చారు. ఆ గ్రామంలో ముందుగా యువతను అందరినీ కూడగట్టుకొని తరుణ్‌ మండల్‌ అనే యువజన సంఘాన్ని ఏర్పాటుచేశారు. దీంతో పాటు అందరికీ నీటి సరఫరా కోసం పానీ పురావత మండల్స్‌ (నీటి సంఘాలు)ను ఏర్పాటుకు కృషిచేశారు.

మద్యానికి వ్యతిరేకంగా…
anna4సంఘ సంస్కర్తగా అన్నా హజారే సమాజంలో పలు మార్పులకు కృషిచేశారు. ఆయన యువతను కూడగట్టుకొని మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. రాలేగన్‌ గ్రామంలోని ప్రజలు అన్ని విధాలా అభివృద్దిచెందడానికి మద్యం అడ్డంకిగా మారిందని ఆయన భావించారు. దీంతో గ్రామంలోని దేవాలయం వద్ద ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రజలతో చర్చించారు. గ్రామంలోని మద్యం కేంద్రాలను మూసివేయడంతో పాటు మద్యం తాగడాన్ని నిషేధించేందుకు సమావేశంలో ప్రజలందరూ ఒప్పుకున్నారు. దేవాలయంలో తీసుకున్న ఈ నిర్ణయం ఓ విప్లవాత్మకమైన నిర్ణయంగా మారింది. దీంతో దాదాపు 30కిపైగా లిక్కర్‌ కేంద్రాలను వాటి యజమానులే స్వచ్చంధగా మూసివేయడం విశేషం. తెరచిఉన్న మద్యం కేంద్రాలను యువత ఉద్యమించి వాటిని బలవంతంగా మూసివేయించారు.

మద్యం కేంద్రాలు చట్ట విరుద్ధంగా నడుస్తుండడంతో వాటి యజమానులు సైతం ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. గ్రామాల్లో తీసుకున్న నిర్ణయానికి విరుద్దంగా కొందరు పక్క గ్రామాల నుంచి మద్యం తెచ్చుకొని తాగితే వారిని మూడు సార్లు హెచ్చరించి నాలుగవ సారి నుంచి శిక్షించడం ప్రారంభించారు. ఇది బాగా పనిచేసి రాలేగన్‌ గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం సాధ్యమైంది. దీంతో గత 25 సంవత్సరాలుగా ఈ గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధం కొనసాగుతుండం విశేషం. అన్నా హజారే పిలుపు మేరకు చివరికి గ్రామంలోని యువత పొగాకు, సిగరేట్లు, బీడీలను సైతం తాగకూడదని నిషేధాన్ని విధించుకున్నారు. హోలి రోజున వీటన్నింటిని తగలబెట్టి గ్రామవాసులు వీటికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

వాటర్‌షెడ్‌ అభివృద్ది కార్యక్రమం…
anna5వ్యవసాయ దిగుబడులను పెంచాలంటే నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చాలని అన్నాహజారే భావించారు. దీంతో ఆయన రాలేగన్‌ గ్రామంలో వాటర్‌షెడ్‌ నిర్మాణానికి కృషిచేశారు. దీని నిర్మాణం కోసం గ్రామవాసులు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపుమేరకు ప్రజలందరూ స్వచ్చంధంగా శ్రమదానంలో పాల్గొని కాల్వలు, చెక్‌ డ్యామ్‌లను నిర్మించుకున్నారు. దీంతో గ్రామంలో వ్యవసాయం కోసం నీటి కొరత తీరి పంట దిగుబడులు బాగా పెరిగాయి.

పాల ఉత్పత్తి…
రాలేగన్‌ సిద్ది గ్రామంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు అన్నా హజారే ఎంతో కృషిచేశారు. ఎక్కువగా పాలిచ్చే గేదెలను కొనుగోలుచేసి వెటర్నరీ డాక్టర్ల సహచారంతో క్రాస్‌ బ్రీడ్‌ ద్వారా గేదెల పెంపకాన్ని చేపట్టారు. దీంతో గ్రామంలో పాలిచ్చే గేదెల సంఖ్య పెరిగి పాల ఉత్పత్తి క్రమ,క్రమంగా పెరిగింది. ఆయన కృషితో 1975కి ముందు గ్రామంలో వంద లీటర్ల పాలు ఉత్పత్తి అయితే ఆ తర్వాత పాలిచ్చే గేదెల మూలంగా 2500 లీటర్ల పాలు ఉత్పత్తి కావడం విశేషం. ఈ పాలను గ్రామవాసులు అహ్మద్‌నగర్‌లోని మల్‌గంగ డైరీలో విక్రయిస్తూ ఆర్థికంగా అభివృద్ది చెందారు. అన్నా హజారే కృషితో గ్రామవాసులు రాలేగన్‌ సిద్ది గ్రామంతో పాటు పొరుగు గ్రామాల్లోని బాల్వాడీలలో పిల్లలకు పోషకాహారంగా పాలను ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. గ్రామస్థులు అందరూ కలిసి మెలిసి ఉంటూ ప్రతిరోజు మినీ ట్రక్కుల ద్వారా పాలను అహ్మద్‌నగర్‌కు తీసుకెళ్లి, వచ్చేటప్పుడు గ్రామానికి కావాల్సిన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకురావడం ప్రారంభించారు.

విద్య…
anna2 గ్రామంలో అక్షరాస్యతను పెంపొందించేం దుకు అన్నా హజారే విశేషంగా కృషిచేశారు. ఒకప్పుడు అక్కడ చిన్న పాఠశాల ఉంటే హజారే కృషి మేరకు 1979 వరకు ప్రాథమిక, మాద్యమిక, ఉన్నత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో అక్షరాస్యత కోసం సంత్‌ యాదవ్‌ బాబా శిక్షాణ్‌ ప్రసారక్‌ మండల్‌ (ట్రస్ట్‌)ను 1979లో ప్రారంభించారు.

అంటరానితనం నిర్మూలనకు…
రాలేగన్‌ గ్రామంలో అంటరానిత నాన్ని దూరం చేసేందుకు అన్నా హజారే పోరాటం చేశారు. ఆయన కృషితో గ్రామంలోని అగ్రవర్ణాలు, బడగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ వివిధ పండుగలు, పర్వదినా లను జరుపుకోవడం ప్రారంభించారు. అక్కడ దళితులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి వేడుకలను జరుపుకుంటున్నారు.

సామూహిక వివాహాలు…
సామూహిక వివాహాల ద్వారా పేద కుటుంబాల్లోని యువతీ,యువకుల పెళ్లిళ్లు జరిపించారు అన్నా హజారే. పేద కుటుంబాలు వివాహానికి పెద్ద మొత్తంలో అయ్యే ఖర్చును భరించేవారు కాదు. దీన్ని గుర్తించిన హజారే గ్రామంలో తరుణ్‌ మండల్‌ ద్వారా పేద వధూ,వరుల వివాహాలను సామూహికంగా జరిపించి పెళ్లి భోజనాన్ని ఉచితంగా వండించి వడ్డించేవారు. వివాహానికి అవసరమైన లౌడ్‌ స్పీకర్లు, మండపం, అలంకరణ అంతా తరుణ్‌ మండల్‌ చూసుకునేది. ఇలా 1976 నుంచి 1986 వరకు అన్నా హజారే ఆధ్వర్యంలో 424 వివాహాలను జరగడం విశేషం.

సమాచార హక్కు ఉద్యమం…
ప్రజలందరికీ ప్రభుత్వ శాఖలోని అన్ని రకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కోసం సమాచార హక్కును కల్పించాలని అన్నాహజారే మహారాష్టల్రో ఉద్య మించారు. ఆయన ఉద్యమం మూలంగా అక్కడ మహా రాష్ట్ర రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ వచ్చింది. ఆ తర్వాత కేం ద్ర ప్రభుత్వం దీన్ని కొన్ని మార్పులతో రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ 2005 (ఆర్‌టిఐ)గా తీసుకురావడం విశేషం.
– ఎస్‌.అనిల్‌ కుమార్‌
అవినీతికి చెక్‌…?
anna1అవినీతిని నిరోధించేందుకు ఇదివరకే లోక్‌పాల్‌ బిల్లు ఉన్నా అది కేవలం నామమాత్రంగా మిగిలిపోయింది. దీని స్థానంలో జన్‌ లోక్‌పాల్‌ బిల్లును ప్రవేశపెట్టాలని అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంతకీ లోక్‌పాల్‌ బిల్లులో ఏమున్నాయి..?, జన్‌ లోక్‌ పాల్‌లో ఏముండాలని హజారే కోరుకుంటున్నారో తెలుసుకుందామా…

లోక్‌పాల్‌ బిల్లు…
1. స్వతంత్రంగా చర్యలు తీసుకునే అధికారం లోక్‌పాల్‌కు లేదు. లోక్‌సభ స్పీకర్‌ లేదా రాజ్యసభ అద్యక్షుడికి ప్రజలు ఫిర్యాదులు చేయాలి. వారు ఆమోదించి పంపిన వాటిపైనే లోక్‌పాల్‌ దర్యాప్తు జరిపిస్తుంది.
2.సలహా సంఘంగా మాత్రమే లోక్‌పాల్‌ పనిచేస్తుంది. అది దర్యాప్తు నివేదికను సంబంధిత అధీకృత సంస్థకు పంపాలి. చివరికి చర్యలు తీసుకునేది ఆ సంస్థే. మంత్రుల విషయంలో ప్రధాని, ఎంపీల విషయంలో లోక్‌సభ, రాజ్యసభ అధ్యక్షులదే తుది నిర్ణయం. ఇక ప్రధానిపైన ఆరోపణలు వస్తే చేయడానికేమీ లేదు.
3.లోక్‌పాల్‌కు చట్టపరమైన రక్షణ, పోలీసు అధికారాలు లేవు. ఈ సంస్థ చేపట్టే విచారణలు ప్రాథమిక విచారణలే.
4.ఇందులో సీబీఐ పాత్ర ఎలా ఉంటుందో తెలియదు.
5.ఏదైనా ఫిర్యాదు అబద్దమని తేలితే ఫిర్యాదుదారున్ని లోక్‌పాల్‌ జైలుకు పంపవచ్చు. ఈ ఫిర్యాదు నిజమైతే రాజకీయ నాయకుడిని జైలుకు పంపే అధికారం మాత్రం లోక్‌పాల్‌కు లేదు.

జన్‌ లోక్‌పాల్‌లో…
1.స్వతంత్రంగా దర్యాప్తు జరిపే సంస్థగా లోక్‌పాల్‌కు అధికారాలు ఇవ్వాలి. ప్రజలు నేరుగా ఈ సంస్థకు ఫిర్యాదుచేసుకునే అవకాశం కల్పించాలి.
2.లోక్‌పాల్‌ను సలహా సంఘం గా కాకుండా దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎంతటి వ్యక్తికి వ్యతిరేకం గానైనా విచారణ ప్రారంభించే అవకాశం కల్పించాలి.
3.సంపూర్ణ పోలీసు అధికారాలతో కూడిన లోక్‌పాల్‌ కావాలి. దీంతో ఫిర్యాదు దర్యాప్తుతో పాటు ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఏర్పడుతుంది.
4.అవినీతి కేసులను దర్యాప్తు చేసే సీబీఐ విభాగాన్ని లోక్‌పాల్‌లో విలీనం చేయాలి.
5. లోక్‌పాల్‌ విచారణ పరిధిని కేవలం రాజకీయ నాయకుల వరకే పరిమితం చేయకుండా అధికారులు, న్యాయమూర్తులను కూడా అందులో చేర్చాలి.

anna6

Surya Telugu Daily.

ఏప్రిల్ 9, 2011 - Posted by | వార్తలు | ,

4 వ్యాఖ్యలు »

 1. really we have to apreciate anna, his name not only ANNA hazare but also ANNA to all indians.

  వ్యాఖ్య ద్వారా BRAHMANANDAM | ఏప్రిల్ 9, 2011 | స్పందించండి

 2. very good Item……..

  వ్యాఖ్య ద్వారా pullarao tamiri | ఏప్రిల్ 9, 2011 | స్పందించండి

 3. Annaji, Meeru e desanike rakshakulu, meeventa desamanta undi.

  వ్యాఖ్య ద్వారా shriniwasareddy | ఆగస్ట్ 17, 2011 | స్పందించండి

 4. anna hajare chala goppa vyakthi ayana cheppattina ee karyakramam vijayavantham kavalani a devunni korukuntunnanu

  వ్యాఖ్య ద్వారా Nagendra babu | ఆగస్ట్ 17, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: