హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

సంగీత సాహితీస్రష్ట రాళ్ళపల్లి

సంగీత సాహితీస్రష్ట రాళ్ళపల్లి

శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. రాళ్ళపల్లివారు అనంతపురం జిల్లా రాళ్ళపల్లి గ్రామంలో 1893 జనవరి 23న అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు పుత్రులుగా జన్మించారు. సంస్కృతాంధ్రములలో పండితులైన తండ్రి వద్ద సంస్కృతాంధ్రముల నభ్యసించారు. తల్లి కీర్తనలు, జానపదగేయాలను శ్రావ్యంగా గానం చేసేవారు. తల్లి నేర్పిన పాటలను యథాతథంగా నేర్చుకొన్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నారు.

1906లో శర్మగారు మైసూరులోని పరకాల మఠంలో శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాలయతీంధ్రుల సన్నిధిలో వుంటూ శ్రీ చామరాజేంద్ర సంస్కృత కళాశాల విద్యార్ధిగా వ్యాకరణం సంస్కృత కావ్యాలను సాకల్యంగా అభ్యసించారు. 1910లో కట్టమంచి రామలింగారెడ్డిగారు మైసూరు మహారాజు కళాశాలలో చరిత్ర, తర్కం, తత్త్వశాస్త్రం, ఆంగ్ల సాహిత్యాచార్యులుగా బోధించేవారు. రెడ్డిగారితో పరిచయం వల్ల శర్మగారు ఆంధ్ర సాహిత్యంలో చక్కని పాండిత్యం గడించారు. రెడ్డి శర్మగారి ప్రతిభాపాటవాలను గుర్తించి మైసూరు మహారాజా కాలేజిలో తెలుగు పండితులుగా నియమింపచేశారు. బోధకాగ్రగణ్యులుగా పేరుగాంచిన శర్మ కాలేజీలో ముప్పది ఏళ్ళు పనిచేశారు. శర్మ, కట్టమంచి వారు సవిమర్శకంగా కవిత్రయ భారతాన్ని అధ్యయనం చేశారు. 1911లో, తారాదేవి, మీరాబాయి అనే ఖండకావ్యా లను రచించారు. 1913లో ”లీలావతి” అన్న నవలను వంగభాష నుండి కన్నడీకరించారు. కట్టమంచివారు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులుగా వుండి వేమనపై ఉపన్యాసాలను అనంతపురంలోని సీడెడ్‌ డిస్ట్రిక్స్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. 1928 నవంబరు చివరన శర్మ వేమనపై చేసిన ఉపన్యాసాలు ఎంతో విజ్ఞానదాయక మైనవి. ఆ ఉపన్యాసాలలోని కొన్ని వాక్యాలు ”ఇరు ప్రక్క లందును మరుగులేని మంచి పదనుగల చురకత్తివంటి కవితాశక్తి, దానికి మెరుగిచ్చినట్టి, సంకేత దూషితముగాని, ప్రపంచ వ్యవహారములందలి సూక్ష్మదృష్టి, గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత”… ఇవన్నియు వేమన్నను సృష్టిచేయునపుడు బ్రహ్మదేవుడుపయోగించిన మూల ద్రవ్యములు” అన్నారు. వేమన ద్వారా రాళ్ళపల్లి వారు కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శకు బాటవేశారు. రాళ్ళపల్లివారి సారస్వతోపన్యాసాలు, వారిని తెలుగు విమర్శకులలో అగ్రగణ్యునిగా చేశాయి. పీఠికా రచనలో కూడా రాళ్ళపల్లి గొప్ప పేరు గాంచారు. 1934లో బళ్ళారిలో ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావుల స్మారకోత్సవంలో శర్మగారిచ్చిన ”నాటకోపన్యాసములు”లో నాటక లక్షణములను విపులంగా వివరించారు. సుందరపాండ్యుని ”ఆర్య”ను శర్మగారు తెనిగించారు. ప్రాకృత భాషలో పరిణితులైన శర్మగారి ”గాథా సప్తశతీసారము” వారి అనువాద సామర్ధ్యానికి నిదర్శనంగా వుంది. మధునాపంతులవారు రాళ్ళపల్లివారిని గురించి రాస్తూ ”సాహిత్య ప్రపంచమున కవితా విమర్శనశాఖకు వారి దర్శనము చిరంతన వసంతమన్నారు. సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం. శర్మగారు రచించిన ”గానకలె”, జీవమత్తుకలె” అన్న గ్రంథాలు వారి కన్నడ భాషా వైదుష్యానికి మచ్చుతునకలు. సంగీత ప్రియులైన శర్మగారు, సంగీత విద్వాంసులైన బిడారం కృష్ణప్పగారి వద్ద నాలుగైదేళ్ళు శాస్త్రీయంగా సాధన చేశారు. 1927లో అనంతపురంలో జరిగిన ఆంధ్రగాయక మహాసభలో శ్రోతలు భోజన సమయాన్ని విస్మరించి అత్యంత ఆసక్తితో విని వారి గానలహరిలో మునకలు వేశారు. మైసూరు మహారాజావారు ఏర్పాటుచేసిన కవితాపరీక్షలో ప్రథమబహుమతి నందుకొని మహారాజావారి దర్బారులో ఘన సత్కార మందుకొన్నారు. గానకళాసింధు, గానకళాప్రపూర్ణ, సంగీత కళానిధి బిరుదములందుకొన్నారు.

మైసూరులో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థాన కార్య నిర్వాహణాధికారి, చెలికాని అన్నారావుగారు ‘తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించమని కోరారు. శర్మగారు 1950-57 మధ్య తాళ్ళపాక కవుల సంకీర్తనలను పరిశీలించి వాటిని స్వరపరిచారు. శర్మగారిని కేంద్ర సంగీత నాటక అకాడమీ 18-10-1970న ”ఫెలోషిప్‌”నిచ్చి సత్కరించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యా లయం 30-4-1974 గౌరవ ”డి.లిట్‌” పట్టాతో గౌరవించింది. రేడియోకు ”ఆకాశవాణి” అన్నపేరు పెట్టింది శర్మగారే. సంగీత, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన శర్మగారిని 1979 మార్చి 11న తి.తి.దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. వయోభారంతో వారు తిరుపతికి వెళ్ళలేక పోయారు కార్యనిర్వాహణాధికారి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారు బెంగుళూరు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు శర్మగారికి బిరుదు ప్రదానంచేసి సత్కరించారు. కాని ఆ దినం రాత్రం 7-05 గంటలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన రాళ్ళపల్లివారు స్వర్గస్థులైనారు.

-జానమద్ది హనుమచ్ఛాస్త్రి

Visalaandhra Daily .

మార్చి 13, 2011 - Posted by | సంస్కృతి

ఇంకా వ్యాఖ్యలు లేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: