హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ఆంధ్రభోజుని అందాల నగరం… హంపి

ఆంధ్రభోజుని అందాల నగరం… హంపి
అహో ఆంధ్రభోజా… శ్రీకృష్ణ దేవరాయా..!
ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా..!!
ఈ పాట విన్నప్పుడల్లా హంపి ఎలావుంటుంది? అనుకుంటుంటాం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని నేటికీ తనలో దాచుకుంది హంపి నగరం. మేము హంపి చూడాలని ఎప్పటినుండో అనుకుంటూనే అలాగే గడిచిపోయింది.. శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవానికి కూడా వెళ్లి ఆ హంపీ వైభవం చూడాలనుకున్నాం. కాని అప్పుడూ కుదర్లేదు. ఇదిగో ఈ నెల మా ఇంట్లోని అందరం కలిసి హంపీ చూడడానికి వెళ్లాం. అక్కడికి వెళ్లాక ప్రతిశిల్పం దగ్గర ఘంటసాల మృదుమధుర గీతం మనకు అడుగడుగునా విన్పిస్తుంది.

krishna-devarayalaఅనంతపురం నుండి బళ్లారి జిల్లా హోస్పేటకు సరాసరి వెళ్లాం. అక్కడి నుండి హంపి 13 కిమీ ఒక అర్ధగంటలోపే హంపికి చేరాం. అప్పటికే అనంతపురం నుండి ఓ మిత్రుడిద్వారా వసతి ఏర్పాటు చేసుకున్నాం. ఈ వసతి ని ఏర్పాటు చేసిన కమలానగర్‌లో ఉంటున్న శ్రీనివాస్‌, హనుమంతుగార్లకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేం ఉదయం 11 గంటలకు రూముకు చేరి భోజనం అయ్యాక హంపీని చూడడానికి బయల్దేరాం.

నేడు ఈ హంపీ నగరం శిథిల నగరంగా కన్పిస్తున్నా… ఇప్పటికీ అద్భుతంగా, ఏమాత్రం ఆకర్షణ తరగని గనిలా శిల్ప సౌందర్యంతో ఉట్టి పడుతూ ఉంది. నగరం చుట్టూ గ్రానైట్‌ కొండలూ, రాళ్ల గుట్టలూ మధ్యలో పారుతున్న తుంగభద్రానది. ఈ నది ఒడ్డున పొడవుగా అందమైన దేవాలయాలు, సుంద రమైన రాజప్రాసాదాలు, శిథిలమైనా తమ అందాల్ని ఒలకబోస్తున్న శిల్పాలు. పర్యాటకులకు, కళాభిమానులకు ఈ హంపీ నగరం ఒక స్వర్గధామం. హంపీలో ఒక్కో మలుపు వైపూ ఒక్కో ఆకర్షణ. అద్భుతమైన దృశ్యకావ్యాలు. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే ఆనాడు రాయల కాలంలో ఇంకెంత సొగసుగా ఉండేదో ఈ నగరం అన్పించకమానదు.

అందుకే ‘హంపీ’ కట్టడాలు యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అయితే ఈ కట్టడాలను పరిరక్షించే విషయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపుతోందని ఈ ఫిబ్రవరి 15 న కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు అక్షింతలు వేసింది. హంపీ చారిత్రక, స్మారక చిహ్నాలను పరిరక్షించే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చూపే నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఏదేమైనా ఈ హంపీ జాతిసంపద. తప్పకుండా పరిరక్షించాల్సిందే..!!

విజయనగర సామ్రాజ్యంలో ‘హంపి’ తళుకులు…
devaraibulid మహమ్మదీయులు మనదేశం దక్షిణ ప్రాంతంలోకి రావడం వలన అంతకు ముందు వందలాది సంవత్సరాల పాటు సాగిన అనేక నిర్మాణ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఈలోగా మహోత్తుంగ తరంగంలా విజయనగర సామ్రాజ్యం పైకి వచ్చింది. 14 వ శతాబ్ది మధ్య కాలం నాటికి ముస్లింల రాకకు ఆనకట్టవేసింది. దక్షిణ భారతదేశ మంతా విస్తరించింది. హంపి (విజయనగర) ని రాజధానిగా చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు విజయనగర చక్రవర్తులు.

విరివిగా ఆలయాలను నిర్మించారు. తర్వాతి కాలంలో వారి రాజధానులైన పెనుకొండ (అనంతపురం జిల్లా) చంద్రగిరి (చిత్తూరు జిల్లా), వారి సామంతరాజ్యాల రాజధానులైన వెల్లూర్‌ (ఉత్తర ఆర్కాటు) జింజి (దక్షిణ ఆర్కాటు), తంజావూర్‌, మధురై, ఇక్కెరి (షిమోగా) లలోనూ, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, లేపాక్షిలలోనూ విరివిగా ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల్లో అపూర్వమైన గోపురాలు, అందమైన శిల్ప సముదాయాలూ, మండపాలూ ఉన్నాయి. నిజానికి విజయనగర రాజుల హయాంలో కట్టినన్ని ఆలయాలు చోళరాజుల కాలంలో కూడా కట్టలేదు.

Lowtas-Mahalవిజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం విజయనగరానికే విద్యానగరమన్న పేరుంది. శృంగేరీ పీఠాధిపతి అయిన విద్యాశంర (విద్యా తీర్థ) స్వామివారి ప్రధాన శిష్యుడూ, విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్యస్వామిపట్ల గౌరవ సూచకంగా విద్యా నగరం అన్న పేరువచ్చింది. ఈ విద్యారణ్యుడు అప్పటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన హరిహర, బుక్కరాయుల సోదరులకు గురువుగా నిలిచి విజయనగర హిందూ సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఆయన ఆధ్వర్యంలో 1వ విరూపాక్షరాజు 1336 ఏప్రిల్‌ నెలలో విరూపాక్షస్వామి సమక్షంలో పట్టాభిషిక్తుడయ్యాడు. తుంగభద్ర నదికి ఆవల ‘ఆనెగొంది’ అనే గ్రామంలో చాలా ఎత్తుగా భద్రంగా పెద్ద కోటను నిర్మించారు. నదికి ఇటువైపున హంపీని రాజధానిగా ఏర్పాటు చేసుకొని బుక్కరాయ సోదరులు పరిపాలన సాగించారు.

ఇక వీరి కాలంలోనే విజయనగర సామ్రాజ్య ఉత్తర భాగంలోని నిర్మాణాలకు అంతకు పూర్వపు ఇసుక రాతిని వద్దని కఠిన శిలను ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన పెద్దమార్పు. ఈ కారణంగానే ఆనాటి శిల్పులు కొత్త ముడి వస్తువుని ఎన్నుకొని కొంగ్రొత్త పోకడలుపోయి విశిష్టమైన విజయనగర శిల్పయుగాన్ని సృష్టించారు. అసంఖ్యాకంగా ఉన్న ఆలయాలకు, తుంగభద్ర నదీతీరాన పెద్దరాతి కొండ నడు మ పురాతన విరూపాక్ష ఆలయం చుట్టూ నిర్మించిన హంపి నగరపు కోటకు, వాటి గోడలకు, ద్వారాలకు అక్కడ కొండలలో లభ్యమైయ్యే గట్టి రాతిని వాడారు. విజయనగర శిల్పులు భారతీయ వాస్తుకళా వికాసంలో కొత్తపుం తలు తొక్కి తర్వాత తరాల వారికి పురాతన శిల్ప సంప్రదాయాన్ని జవసత్వాల తో నిండుగా అందించారు.

విరూపాక్ష ఆలయం…
krihsandevar-tempహంపీలోని విరూపాక్ష ఆలయం చాలా పెద్దది. ఇక్కడ ప్రధాన దైవం విరూపాక్షుడు. శివుడినే ఇక్కడ విరూపాక్షస్వామి అంటారు. ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. హంపీ వీధికి పశ్ఛిమ దిశగా ఎతె్తైన గోపురం దేవాలయం లోపలికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయం క్రీశ 10-12 శతాబ్దాలలో కట్టి ఉంటారనీ, చాళుక్యుల తర్వాత వచ్చిన హోయసలులు కూడా కొన్ని పునరుద్ధరణ చేశారనీ చరిత్ర కారుల అంచనా. అయితే ప్రధాన ఆల యాన్ని విజయనగర రాజులు పునరుద్ధ రించి అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి చుట్టూ మూడు ప్రాకారాలున్నాయి.

తూర్పున ఉన్న ఎతె్తై న గోపురం దాటి లోపలికి వెళ్తే మొదటి ప్రాకారం వస్తుంది. అది దాటి వెళ్తే స్తంభాలతో కప్పబడిన వసారా వస్తుంది. ఇది దాటి వెళ్తేనే గర్భగుడి వస్తుంది. ఈ ఆలయ కప్పుమీద, స్తంభాల మీద అందమైన వర్ణచిత్రాలు చెక్కారు. శృం గేరీ పీఠాధిపతిని సకల రాజమర్యాదల తో పల్లకీలో విరూపాక్ష దేవాలయా నికి తీసుకొస్తున్నట్లుగా చాలా గొప్ప గా వర్ణసముదా యంతో చిత్రించా రు. ఈ గర్భగుడికి ఒక ప్రత్యేకత ఉంది. తుంగభద్రా నది నుండి చిన్న పాయ ఒకటి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడికి నీరు అంది స్తూ బయటి ప్రాకారం ద్వారా మళ్లీ బయటికి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి యాత్రికులు కోదండ రామా లయానికి, యంత్ర ఆంజనేయ గుడికి వెళ్తారు.

Virupaksha-temple-gopఅలాగే అక్కడి నుంచి విఠలేశ్వరా లయానికి నైరుతీగా నడిచి వెళ్తుంటే దారిలో ఒక తులాభారం తూచే రాతి కట్ట డం కన్పిస్తుంది. దీనిని రెండు గ్రానైట్‌ స్తంభాలను కలుపుతూ పైన భూమికి సమాంతరంగా ఒక రాతికమ్మీ ఉంది. ఈ నిర్మాణాన్ని ‘రాజ తులాభారం’ అం టారు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ రాజు తన ఎత్తు బంగారు, వజ్రవైఢూ ర్యాలను తూచి బ్రాహ్మణులకు దానం చేశేవాడట. ఇది పూర్తిగా గ్రానైట్‌రాతితో కట్టడంతో ఇప్పటికీ చెక్కు చెదరకుం డా ఉంది. ఇంకొక దేవాలయం ‘హజారా రామాలయం’. దీర్ఘచతురస్రాకారం గా ఉన్న ఈ ఆలయాన్ని అంతకు ముందు రాజవంశీయులు ఎవరో ప్రారం భించగా దీనిని శ్రీకృష్ణ దేవరాయలు పూర్తి చేశారంటారు.

అయితే ఈ ఆలయాన్ని రాజప్రతినిధుల కోసం అప్పట్లో నిర్మించారట. ఈ ఆల య బయటగోడల మీద శ్రీకృష్ణుడి లీలలు, రామాయణ కథ మొత్తం చిన్నచిన్న శిల్పాలతో చాలా అందంగా చిత్రిం చారు. ఆలయం లోపల నల్ల గ్రానైట్‌రాయి తో స్తంభాలపై అందమైన శిల్పాలను చె క్కారు. ఈ ఆలయం దగ్గరే ఆ శిల్పాలను చూస్తూ చాలా సేపు ఆగిపోతాం. ఈ ఆల యం మీద రామాయణ గాథకు సంబం ధించి శిల్పాలు లెక్కకు మించి ఉండడం తో ఈ ఆలయాన్ని సహస్ర రామాల యం… అంటే ‘హజారా రామాలయం’ అనే పేరువచ్చిందంటున్నారు.

విఠలాలయం…
హంపీలో ఎక్కువగా దాక్షిణాత్య శిల్పరీతులననుసరించి నిర్మించిన ఆలయాల లో చెప్పుకోదగ్గది విఠలాలయం. ఆనాటి అతిపెద్ద ఆలయాలలో ఇది ఒకటి. మండపాలు, గరుడ కల్యాణమండపాలు, ప్రాకారమూ, గోపురమూ అన్నీ కలసిన ఒక బ్రహ్మాండమైన సముదాయంగా నిర్మించాలనుకుని ఆ విఖ్యాత సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు 1513వ సంవత్సరంలో ప్రారంభిం చాడు. కానీ 1565లో సామ్రాజ్యం విచ్ఛిన్నమైయ్యేవరకూ పూర్తికాలేదు. ఆ తర్వాత విజయ నగర సామ్రాజ్యాన్ని రాయలు అనంతపురం జిల్లా పెనుకొండ కు మార్చాడు.

Vittala-templeవిఠలాలయం సముదాయం చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి తూర్పున, దక్షిణాన, ఉత్తరాన గోపుర ద్వారాలున్నాయి. మండపాలు, ఉప మండపాలు, చుట్టూ పరివార ఆయతనాలున్నాయి. అన్నీ విజయనగర ఆలయాలలో మాదిరిగా ఇక్కడి మండపాలు, గోపురాలు చాలా పెద్దవి. దాదాపుగా అన్నీ వెయ్యి స్తంభాల మండపాలే. కుడ్య స్తంభాల మధ్య భాగాలు నాజూకుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఒకే రాతి నుంచి చెక్కిన మధ్య స్తంభమూ, చుట్టూ ఉప స్తంభాలూ లేదా జంతువులు ఉన్నాయి. ఈ స్తంభాలమీద మీటితే ‘సరిగమపదనిస’ స్వరాలు పలుకుతాయట! ఇప్పటికికూడా! అయితే వచ్చిన యాత్రికులంతా ఆ స్తంభాల మీద రాళ్లతో కొట్టి పరీక్షిస్తున్నారని ఇపుడు కర్నాటక గవర్నమెంటు గట్టి సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడే ‘ఏకశిలారథం’ ఒక అత్యద్భుమైన కట్టడం. ఒకేరాతిలో చెక్కిన రథం, పైన రెండు గోపురాలతో అద్భుతంగా చెక్కారు. పైన రెండు గోపురాలు నేడు శిథిలమైనా ఈ ఏకశిలారథం చక్కగా ఉంది. ఈ ఏకశిలా రథాన్ని చూడగానే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది…

‘ఏకశిల రథముపై లోకేసు ఒడిలోనే… ఓర చూపుల దేవి ఊరేగిరాగా… రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా…’ అంటున్న ఘంటశాల మన మదిలో మెదులుతాడు..
ఈ ఏక శిలాస్తంభ పరివారాలు విజయనగర రాజుల శైలి విశిష్టతలలో ఒకటి. కొన్ని పాత ఆలయాల వెలుపలి ప్రాకారాల మధ్య బ్రహ్మాండమైన గోపురాలను చేర్చారు. వీటిని ‘రాయ గోపురాలు’ అని పిలుస్తారు. ఇక సూర్యాస్తమయం అవుతుండగా మెల్లగా రూముకు తిరిగి వచ్చాం. రెండో రోజు ఉదయాన్నే టిఫిన్‌ చేసి హంపీ నగరం రెండో వైపునకు బయలు దేరాం.

Enugula-saalaఇక్కడ ఏకశిలతో కట్టిన ‘ఉగ్రపరసింహ’ మూర్తి పెద్ద శిలలో తొలిచారు. పక్కనే ‘బీదలింగ’ మనే శివలింగం ఉంది. ఆ లింగం ప్రతిమ కింద నుండి విరివిగా జల వస్తూ ఆ జల అక్కడి పంటపొలాలకు వెళ్లడం చూస్తాం. తరువాత ‘శ్రీకృష్ణాలయం’ కూడా అక్కడే ఉంది. ఇది చిన్నికృష్ణుని ఆలయం. ఇపుడు పూర్తిగా శిథిలమైపోయి ఉంది. కళింగదేశంపై రాయలు విజయానికి చిహ్నంగా కట్టించాడని ఇక్కడ శాసనం ఉంది. ఈ ఆలయం పరివార ఆలయాలతో, మండపాలతో, స్తంభఋ౎లతో, మాలికలతో, అందమైన గోపురం ఉన్న మనో జ్ఞమైన ఆలయం. అయితే ఇపుడు శిథిలమైనా తప్పక చూడాల్సిందే. గర్భగు డిలో విగ్రహంలేదు. ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద వీధి ఉంది. ఈ వీధికి రువైపులా చిన్న చిన్న గదుల్లా కట్టిన రాతికట్టడాలున్నాయి. ఇవి దాదాపు వంద లాది ఉంటాయి. ఇక్కడే ఈ వీధుల్లోనే రత్నాలూ, వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మేవారట!

Tungabhadra-nadi ఇంకా ఇక్కడ చూడాల్సినవి క్వీన్‌బాత్‌ కట్టడం, లోటస్‌ మహల్‌, ఏనుగుల గజ శాల, సరస్వతీ దేవాలయం, పుష్కరిణి, పురావస్తు శాఖవారి మ్యూజియం తప్పక చూడాల్సినవి. మ్యూజియం హంపీ నగరానికి దగ్గరలోని కమలాపురం లో ఉంది. ఇవన్నీ చూసుకొని ఇకరాత్రికి తిరుగు ప్రయాణం అయ్యాం.ఎలా వెళ్లాలి? దేశం నుండి బళ్లారికి విమాన, రైలు బస్‌ సౌకర్యం అన్ని ప్రాంతాలనుండి ఉన్నాయి. బళ్లారి నుండి హోస్పేటకు 60 కిమీ హోస్పేట నుండి హంపి 13 ిమీ ఇక్కడ మొత్తం హంపి నగర సందర్శనకు టూరిస్ట్‌ గైడ్లు విరివిగా ఉన్నారు. ఆటోలు, కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలోకి కారు ఆటోలు వెళ్లవు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనం, సైకిళ్ల మీదనే వెళ్లాలి. వీటిని కూడా అద్దెకు ఇస్తారు ఇక్కడ. ఎక్కువగా విదేశీయులు మనకు తారసప డతారు. వాళ్లంతా సైకిల్‌, ద్విచక్రవాహనంమీద తిరుగుతారు. అలా కూడా మొత్తం చూడొచ్చు. విజయనగర రాజుల మొదటి కోట ‘ఆనెగొంది’ కోటకు వెళ్లాలంటేమాత్రం తుంగభద్ర నదిమీద చిన్న పుట్టీల (గుండ్రంగా ఉండే పడవ లాంటివి) మీద వెళ్లాల్సిందే.
– దామర్ల విజయలక్ష్మి, అనంతపురం

Surya Telugu Daily .

మార్చి 8, 2011 - Posted by | చూసొద్దాం | , ,

ఇంకా వ్యాఖ్యలు లేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: