హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

తెలుగు కథానికల హిమగిరి

తెలుగు కథానికల హిమగిరి
ప్రచారాలకు…ప్రాభవాలకు ఆయన బహుదూరం…సామాజిక సమస్యలే ఆయన కథావస్తువులు…జైలుగోడల మధ్య జీవించే ఖైదీల కథలే ఆయనకు స్పందనలు…జీవితంలో ఆయన ఎప్పుడూ ఇది కావాలని కోరుకోలేదు…గొప్పగా జీవించాలని కోరుకోనూలేదు…డాక్టర్‌ మాత్రం అవ్వాలనుకున్నారు…పరిస్థితులు అనుకూలించకపోవడంతో డాక్టరేట్‌ అయ్యారు…అలాగని ఉన్నత చదువు చదివించలేని కన్నతండ్రిని ఏనాడూ నొచ్చుకోలేదు…కానీ లోలోపల ఆయనలోని నిస్సహాయతకు మదనపడినా…సమాజంపై అహంకారం పెంచుకోలేదు. మమకారమే పంచాలనుకున్నారు. సమకాలీన సమస్యలపై స్పందించిన ఆయన జర్నలిజాన్నే వృత్తిగా…తన కలాన్నే కత్తిగా మలిచి సామ్యవాద భారతానికి సలాంచేస్తూ…నిష్కల్మషంగా పరిశోధనాత్మక కథానికలకు శ్రీకారం చుట్టారు. ఆయనే వర్థమాన రచయిత వేదగిరి రాంబాబు. నాలుగు వందలకు పైగా కథానికలు…ఎనిమిది నవలికలు…ఎనిమిదివేలకు పైగా శీర్షికలు….రాంబాబు డైరెక్టర్‌గా హైద్రాబాద్‌లో 1994లో స్వాతంత్యానంతర తెలుగు కథానిక ఐదు రోజుల సదస్సు జరిపించారు.ఫలితంగా ‘బంగారు కథలు’ సంకలనం వచ్చింది దానికి సంపాదకులు వాకాతి పాండురంగారావు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (ఎన్‌బిటి, ఢిల్లీ) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి కథానికలకు వేదగిరి రాంబాబు సంపాదకత్వం వహించారు. మన రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో కల్చరల్‌ కౌన్సిల్‌ తరపున నిర్వహించిన రెండువారాల నవ రచయితల అధ్యయన శిబిరాలకు రాంబాబు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.

madhusరాష్టస్థ్రాయి తెలుగు కథా రచయితలనందరినీ ఒకేవేదికపైకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఓ వెబ్‌సైట్‌ కూడా ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. హిమగిరి అంత ఎత్తుకు ఎదిగిన ఆయన ఖ్యాతిపర్వంలో మంచుబిందువంత మనం తెలుసుకునేదంతా…‘నేలవిడిచి సామును చేయను…నేను నమ్మిందే నమ్మకంగా చేస్తా’నంటారు…విముక్తి-పెద్ద కథానికల సంపుటి, కస్తూరి-గొలుసు కథానికల సంపుటి, పే(చీ)జీ కథలు (సింగిల్‌ పేజీ కథలు), ఈ ‘కాలమ్‌’ కథలు (కాలమ్‌…కథలు), వయసు కథలు-(ఒకే అంశంతో కూడినవి) ఇలాంటి సాహిత్య వినూత్న ప్రక్రియలెన్నో రాంబాబు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఎం.ఏ.లో నాలుగు శతాబ్దాల నగరం, కథానికా సదస్సు, కొత్త కథానిక, కథన రంగం వంటి రాంబాబు రచనలు పాఠ్యాంశాలుగా, విద్యార్థుల పరిశోధనాంశాలుగా కొనసాగడం విశేషం.

బాల్యమంతా ఎక్కువగా కృష్ణాజిల్లా తెనాలి తాలూకా చుండూరులోనే…తండ్రి పూర్ణచంద్రరావు ఎకై్సజ్‌ శాఖలో క్రమశిక్షణ కలిగిన ఓ చిరుద్యోగి. ఆయన డ్యూటీలోని సిన్సియారిటీతో కోస్తా ప్రాంతమంతా దాదాపు బదిలీలమీద ఉద్యోగం చేయవలసివుండటంతో రాంబాబు బాల్యం, చదువు అంతా వివిధ ప్రాంతాలలో కొనసాగింది. బాల్యంలో పాఠశాల స్థాయిలో నాటకాలలో కప్పులు సాధించినా… కాలేజీ స్థాయిలో సినిమా ఛాన్సులకోసం ప్రయత్నించాలనుకున్నా తండ్రికి ఇష్టం లేకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ విరమించుకున్నారు రాంబాబు. డిగ్రీ చదువుతున్నప్పుడే సాహిత్యం పట్ల క్రమంగా అభిరుచి పెరిగింది.

యర్రంశెట్టి సాయి రచనలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయంటారు. ఆ రోజుల్లో ఆదివిష్ణు, విహారి లాంటి రచయితలు బందరులోని హిందూ కాలేజీలో ఆయనకు సీనియర్లు. యర్రంశెట్టి సాయి,ఆదివిష్ణు, విహారిలు గురుతుల్యులంటారు రాంబాబు. 1974 సంవత్సరంలో రచయితగా డిగ్రీ ఫైనలియర్‌లో చదువుతుండగా ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీకి సరదాగా పంపిన తొలికథ ‘సముద్రం’ బహుమతి సాధించిపెట్టింది. ఇక అదే క్రమంలో అప్పటి ప్రముఖ వారపత్రికలైన యువ, జ్యోతి, స్వాతి, ఆంధ్రపత్రికలకు వరసగా కథలు పంపిస్తుండేవారు. కొంతకాలం ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేశారు.

రేడియో ద్వారా రాంబాబు కథానికలకు మంచి ప్రాచుర్యం కల్పించారు. తర్వాత ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా వ్యాసాలను వివిధ దినపత్రికలకు పంపించేవారు. కొంతకాలం ఆంధ్రభూమి వారపత్రికలో సీనియర్‌ జర్నలిస్ట్‌గా చేశారు.పల్లకి వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా తనలోని రచనా వ్యాపంగాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. దూరదర్శన్‌ అందుబాటులోకి వచ్చాక దృశ్యమాధ్యమాన్ని సామాజిక అస్త్రంగా మలిచి జనాలలో మార్పుతేవాలని ఆశించారు. ఆ క్రమంలోనే ‘పాపం పసివాడు’ సీరియల్‌ను 52 వారాలపాటు నిరంతరాయంగా దూరదర్శన్‌లో రూపొందించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి దూరదర్శన్‌ టెలీ సీరియల్‌ను తన సొంతఖర్చుతోనే భరించి తీర్చిదిద్దారు.

కమర్షియల్‌గా డబ్బులు మాత్రం ఆశించి ఆ సీరియల్‌ను రూపొందించలేదు. దానికి మాత్రం నిర్మాత, దర్శకునిగా రాష్ట్రప్రభుత్వం తరపున బంగారు నంది అవార్డు దక్కింది. కృష్ణమోహన్‌ టైటిల్‌సాంగ్‌కి కూడా నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ‘అడవి మనిషి’ సీరియల్‌కు రజిత నంది వచ్చింది. దూరదర్శన్‌లో శైలజాసుమన్‌, రమణీసన్యాల్‌ వంటివారితో కలిసి ఇన్‌హేస్‌ సీరియల్ని చేశారు.తర్వాత దాదాపు రెండు సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి జైలు అధికారుల అనుమతి తీసుకుని రాష్ట్రంలోని పలు జైళ్లలో పరిస్థితుల ప్రభావంచేత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల యథార్థగాథలను తీసుకుని వాటినే తన కథావస్తువులుగా చేసుకుని ‘జైలుగోడల మధ్య’ సీరియల్‌గా రూపొం దించారు.

అంతకుముందే అది స్వాతి వారపత్రికలో దాదాపు 60-70 వారాలపాటు పాఠకులను అలరించింది. తన రచనలు ఎక్కడవున్నా చదివి మరీ అభినందనలు తెలుపుతారు సమాచార శాఖలో ఉన్న ఐఏఎస్‌ పార్థసారథిగారు. తెలుగుదేశానికి చెందిన కోడెల శివప్రసాద్‌ కూడా అత్యంత ఇష్టపడే వ్యక్తి తనకు వేదగిరి రాంబాబేనంటారు. రాంబాబు రాసిన ‘జైలుగోడల మధ్య’ పుస్తకరూపంలో దాదాపు చాలా భాషల్లో ప్రచురితమైంది. బాలసాహిత్యంలోనూ బాలల కోసం ఆయన చేసిన కృషి అజరామరం. ఇంద్రధనుస్సు అనే బాలల తొలి వీడియో మేగజైన్‌కు తొలి ఎడిటర్‌గా పనిచేశారు రాంబాబు.

ఇదంతా నాణానికి ఒకవైపే…తెలుగు కథానికలపై వాటిని చిన్నచూపు చూసే వారిపై ఆయన ఇప్పటికీ విమర్శనాస్త్రాలు సంధిస్తునేవున్నారు. ఏనాటికైనా వాటికి కూడా జాతీయస్థాయి గుర్తింపు తేవాలని ఆయన ఉద్దేశం. గ్లోబల్‌ ఆసుపత్రి మీడియా ఇన్‌ఛార్జిగా పనిచేస్తూ తనవద్దకు సాయం కోసం వస్తే వాళ్లకు ఉదారంగా తనకు సాధ్యమైనంతలో వారికి తక్కువ ఖర్చుతోనే వైద్యసేవలు చేయిస్తూ ఇతోధిక సేవలందిస్తున్నారు రాంబాబు. తెలుగు కథానికలపై రాంబాబు తన మనోభావాలను ఇలా పంచుకున్నారు…

కథకి, కథానికకు తేడా ఏ విధంగా గుర్తించవచ్చు?
జ: వస్తువు (కథ) అన్ని సాహిత్య ప్రక్రియల్లో వుంటుంది. పద్యాల్లో చెబితే అటు ప్రబంధాలు, కావ్యాలు కావచ్చు. విస్తృతంగా చెబితే నవల కావచ్చు. సంభాషణ రూపంలో చెబితే నాటకం, నాటిక కావాచ్చు. అదే కథలో ఏకాంశం తీసుకొని క్లుప్తంగా, స్పష్టంగా సూటిగా, వర్ణనలు ఉపోద్ఘాతాలు లేకుండా తర్వాత ఏ జరుగుతుందో తెలుసుకోవాలని ఉత్సుకతని కల్గించే మొదలు, ఒక తీరైన నడక, ఊహించని సంభ్రమాశ్చర్యాలతో ముగించే ’ముగింపు’తో కథను మలిస్తే అది కథానిక అవుతుంది.

కథానికని చదివించే సమయం కన్నా తర్వాత ఆలోచింపజేసే సమయం ఎక్కువ. చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేని విషయం ఏమంటే ’సంపుటి’, ’సంకలనం’ మధ్య భేదం! ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యాంశంలో భిన్న రచయితల కథానికల్ని వాచికంగా ప్రచురించి ’సంపుటి’ అన్నారు. అది ’సంకలనం’ అవుతుంది గాని సంపుటి కాదు. పిల్లలకే కాదు పెద్దలకైనా తెలియని విషయం బోధించేటప్పుడు సంపూర్ణ అవగాహనతో బోధించాలిగాని తెలిసి తెలియకుండా బోధించడం భవిష్యత్తరానికి, భాషకి చేసే ద్రోహం! కథకి ఆధునికత సమకూరింది గురజాడ చేతుల్లో. లక్షణాలను బట్టి ఆధునిక కథను ’కథానిక’ అనాలి. ఒకే రచయిత/త్రికథానికలకయితే ’సంపుటి’ అనాలి. భిన్న రచయిత/త్రిల కథానికలకయితే ’సంకలనం’ అనాలి. రచయితలకే కాదు పాఠకులకు కూడా తెలియటం అవసరం.

కథానికా సదస్సులు జిల్లాలవారీగా నిర్వహించారు కదా, అక్కడ రచయితల/రచయితల స్పందన ఎలావుంది?
జ: కథానిక చాలా గొప్ప ప్రక్రియ. దానికి ఎంతోమంది అభిమానులున్నారు. ఇలా జిల్లాల వెంట వెళ్తూ వారిని పలకరించినప్పుడు పండగ సంబరాలు కన్పించాయి. అలాగే అందరూ ’కథకులం’ మనది ’కథ కులం’ అనే అభిప్రాయం తప్ప వర్గ, కుల, ప్రాంత భావపరమైన ఆభిప్రాయాల్ని తమ మధ్య గోడవాలుగా ఎవరూ భావించటం లేదు. అందరూ కథానికలో తామూ ఒక భాగం అనుకొంటున్నారు. ఈ భాగాలన్నీ కలిస్తేనే ’కథానిక’ అవుతుంది.

రాష్టస్థ్రాయిలో మీరు జరిపిన కథానిక శతజయంతి ఉత్సవం గురించి చెప్పండి?
జ:వంద కథానికల పూర్తి వివరాలతో ’తెలుగు కథానిక డాట్‌ కామ్‌’ కూడా సిద్ధమైంది. 23 జిల్లాల కథానికా తీరుతెన్నులగూర్చి పోటీపెట్టి వ్యాసాల్ని సేకరించాము. ఈ వ్యాస సంకలనాలను జయంతి సభలో ఆవిష్కరించాం. అలాగే రచయిత(త)ల చిరునామాలతో ఒక డైరెక్టరీని తీసుకొచ్చాం. శ్రావ్య, దృశ్య మాధ్యమాల్లో కూడా ఈ సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని చూపించడానికి కృషి చేస్తున్నాము. రాష్తవ్య్రాప్తంగా ఎవరు, ఎక్కడ ఎటువంటి కథానిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా తనవంతు సహకారాన్ని అందిస్తుంది శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్‌ . ఇది కథానిక కోసం అవతరించిన సంస్థ. కథానికకే అంకితమైన సంస్థ. ’కథానిక కొత్త కదలిక కదులిక’ అనేది ఈ సంస్థ నినాదం! ఈ కార్యక్రమాలన్నీ ఎవర్నించీ ఎటువంటి సహాయం స్వీకరించలేక కేవలం నా సొంత సంపాదనతో నిర్వహిస్తున్నాను. అదే నాకు తృప్తి. కాకపోతే ఇంతపెద్ద కార్యక్రమం నిర్వహించటానికి సహకరిస్తున్న వారందరికీ నా కథాభివందనాలు.

పాఠకుల్లో పఠనాసక్తి సన్నగిల్లిందా?
జ:మాధ్యమాల వల్ల పఠనాసక్తి తగ్గటంలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెద్ద భవిష్యత్తుకోసం ఎక్కడెక్కడికో విదేశాలకు పంపాలనే తాపత్రయంతో మాతృభాషను కనీసం చదవను, వ్రాయటం కూడా నేర్పటంలేదు. ఆంగ్లేయులు మనల్ని వదిలి దశాబ్దాలయినా మనం ఇంకా వాళ్ళ భాషాదాస్యం నుంచి బైటపడటంలేదు. మన మాతృభాషని మృతభాష చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి ఎంత హేయమైందో, జననీ జన్మభూమిలాగా మాననీయమైంది. మాతృభాష ప్రాధాన్యతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పటంతోబాటు పిల్లల్లోను తెలుగుపట్ల అభిమానం పెరగాలాని బాలసాహిత్యానికి సంబంధించిన సాహిత్యాన్ని విరివిగా కొని వెళ్ళిన స్కూళ్ళు అన్నిటిలోను పిల్లలకు పంచుతున్నాము. బాలసాహిత్యంతో పిల్లలు ఆకర్షణకు లోనయితే పెరిగిన తర్వాత ఆధునిక సాహిత్యాన్ని అందుకుంటారని ఆశ. మన సాహిత్యాన్ని మనం కోల్పోతే సంస్కారాన్ని కోల్పోతాం. సంస్కృతికి దూరమవుతాం. ఆందుకే అందరూ సాహిత్యాన్ని ఆదరించాలి.
– నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily.

మార్చి 4, 2011 - Posted by | వార్తలు

ఇంకా వ్యాఖ్యలు లేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: