హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

పల్లవుల శిల్పకళావైభవం… భైరవకోన

పల్లవుల శిల్పకళావైభవం… భైరవకోన
భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవులకాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన…

Bhairavakona1సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.

కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌ లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.

bhiravaవీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం.శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.

శివలింగాలన్నీ ఒక్కచోటే…
ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.

ఒకేచోట త్రిమూర్తులు…
bhairava-konaఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ.మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాల యం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది.అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా.ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.

పల్లవ గుహాలయాలు…
waterఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం…వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళు క్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొన సాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.

కోనకు ఇలా వెళ్ళాలి…
భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబ వరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది.

Surya Telugu Daily .

మార్చి 1, 2011 Posted by | చూసొద్దాం | వ్యాఖ్యానించండి

గోదారి ఒడ్డున ప్రకృతి పడుచు… పట్టీసీమ

గోదారి ఒడ్డున ప్రకృతి పడుచు… పట్టీసీమ
అందమైన గోదారి నడుమ అహ్లాద కరమైన వాతావరణంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న ప్రకృతి సౌందర్య కేంద్రం పట్టిసీమ. పట్టిసీమలో విడిది చేయకుండా… పాకింకొండలు-భద్రాచలం బోటు ప్రయాణం పరిపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ వెలిసిన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి తిరునాళ్ళు తప్పకుండా దర్శించాల్సిన ఉత్తవాలు. ప్రకృతి అందాలతోనే కాక చారిత్రకంగా, ఆద్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న పట్టిసీమ పర్యాటక విశేషాలు… ఈవారం విహారిలో…

Pattiseema_3స్థానికులు ‘పట్టిసం’ అని కూడా పిలుచుకునే విశిష్ట విహారకేంద్రం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ. కొవ్వూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం గోదావరి ఒడ్డున, ఇసుకతిన్నెల నడుమ ప్రకృతి అందాలతో అలరారుతోంది.పాపికొండల మధ్య సాగే గోదావరి బోటు ప్రయాణంలో ఇది ప్రధాన విడిది కేంద్రం. ఇక్కడ గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో అత్యధికంగా చిత్రీకరణ జరిగిన మంచి అందమైన దేవాలయం ఇది. ఎప్పుడూ సినిమా షూటింగులతో రద్దీగా ఉండే దీన్ని పట్టిసం, పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రశాంత వాతవరణంలో అతి సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ప్రతియేటా ఐదురోజులపాటు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

సినిమా షూటింగ్‌కు ప్రసిద్ధిగాంచిన దేవాలయం…
పాపి కొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న కొండపై ఈ వీరభద్రస్వామి దేవస్థానం కొలువై ఉంది. చుట్టూ గోదావరి మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే దాదాపు అన్ని కాలాల్లో ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి.

ఆధ్యాత్మికతను నెలవు వీరభద్రస్వామి దేవస్థానం…
ఇక్కడ వెలిసిన వెలసిన వీరభద్రస్వామి ఆలయం మరీ అంత పెద్దది కాకపోయినా సమీప గ్రామాల్లో ఈ ఆలయం విశిష్ట స్థానం సంపాదించుకుంది. ఏడాది మొత్తంలో జరిగే చిన్నా చితకా ఉత్సవాలతో పాటు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఒకప్పుడు దేవాలయము శిధిలమవడం వల్ల దేవాలయానికి పూర్తి మరమ్మత్తులు చేశారు. దేవాలయం చుట్టూ అందమైన తోటలు, పూలమొక్కలు, గడ్డి పెంచుతున్నారు.

Pattiseemaఒకప్పుడు ఇక్కడ కనీసం మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయములో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. భక్తులు విడిది చేసేందుకు ఇక్కడ గదులు నిర్మించారు. త్రాగుగునీటి వసతులు, భోజనశాలలు, గోదావరి పడవల రేవు, స్నానాలరేవులను రెండేళ్ళ క్రితం కొత్తగా ఏర్పాటు చేశారు. చుట్టూ గోదావరి, మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం గంభీరంగానూ, అందంగానూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది.

ఆలయ చరిత్ర…
దక్షయాగంలో సతీదేవి అగ్నికి ఆహుతికాగా, రౌదమ్రూర్తియైన పరమశివుడు తన శిరస్సునుండి ఒక జటాజూటాన్ని పెరికి నేలకు వేసి కొట్టగా అందులోనుండి వీరభద్రుడు ఆవిర్భవించిచాడు. అప్పుడు… దక్షుని యాగాన్ని ధ్వంసం చేయమని శివుడు ఆనతీయగా వీరభద్రుడు ప్రమధగణాలతో హుటాహుటిన దక్షుని యాగ శాలకు వెళ్ళి యఙ్ఞకుండమును ధ్వంసముచేసి అడ్డువచ్చినవారిని సంహరిస్తూ దక్షుని శిరస్సు ఖండించాడు. ఆ రౌద్రమూర్తి దేవకూట పర్వతముపై ప్రళయ తాండవం చేస్తుండగా… అతని చేతిలోని ‘పట్టిసం’ అనే కత్తి జారి దేవకూట పర్వతముపై పడింది. వీరభద్రుని రౌద్ర తాండవాన్ని ఎవరూ ఆపలేక చివరకు అగస్త్యమహామునిని వేడుకున్నారు.

Pattiseema_2అప్పుడు అగస్త్యమహాముని వచ్చి వీరభద్రుని వెనకనుంచి ఆలింగనముచేసుకొని విడిపోయిన అతని జటాజూటాన్ని ముడివేసి అతన్ని శాంతింపచేశాడని పురాణ గాధ.అక్కడే రుద్ర సంభూతుడైన వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై వెలిశాడట. ఈ ఆలయంలో మూల విగ్రహముపై అగస్త్యుని చేతిగుర్తులు, శిరస్సుపై ముడిని మనం చూడవచ్చును. పట్టిసం జారిపడినది కనుక ఈక్షేత్రానికి పట్టిసాచల క్షేత్రమని పేరు వచ్చింది.కాలక్రమేణా అది పట్టిసం, పట్టిసీమగా మారింది.కొవ్వూరు నుండి గోదావరి గట్టున 26వ కిలోమీటరు వద్ద ఉన్న ఈ ేత్రానికి… గోదావరి నదిలోనికి ఏటవాలుగ చక్కని రోడ్డు వుంది.అక్కడనుంచి పడవలలో నది దాటి నదిమధ్యలో గల పట్టిసం కొండకు చేరవచ్చు. వర్షాకాలం మినహాయించి నదీ ప్రవాహాన్ని బట్టి ఇక్కడ ఇసుక తిప్పలు ఏర్పడతాయి.

ఇలా చేరుకోవచ్చు…
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ నగరమైన రాజమండ్రి నుండి పట్టిసీమ సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి పట్టిసీమకు ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్లాలనుకునే వారికి రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య ప్రవహించే గోదావరిపై ప్రయాణించే లాంచీలు కూడా అందుబాటులో ఉంటాయి. విమానం ద్వారా వచ్చే దూరప్రాంత ప్రయాణీకులు రాజమండ్రిలోని కోరుకొండ విమానాశ్రయం నుండి చేరుకోవచ్చు. ఇక రైలు ప్రయాణీకులు రాజమండ్రి లేదా నిడదవోలు స్టేషన్ల ద్వారా ఇక్కడికి చేరవచ్చు. కొవ్వూరు కూడా దగ్గరి రైల్వే స్టేషన్‌ అయినప్పటికీ అక్కడ తగినన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ఆగవు.

Surya Telugu Daily.

మార్చి 1, 2011 Posted by | చూసొద్దాం | వ్యాఖ్యానించండి