హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

నాలుగు శాతాబ్దల ‘ప్రభల’ సంప్రదాయం

నాలుగు శాతాబ్దల ‘ప్రభల’ సంప్రదాయం

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వీటికి దేశ, విదేశాల్లో మంచి పేరుంది. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలలో తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మన పండుగల్లో సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను కోనసీమలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనసీమ వ్యాప్తంగా మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభల తీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు.

amalapuram1దాదాపు నాలుగువందల ఏళ్లుగా కొనసాగుతున్న జగ్గన్నతోట ప్రభల తీర్థం, కొత్తపేటలో జరిగే ప్రభల తీర్థానికి రాష్టస్థ్రాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలు ఎగువ కౌశికదాటి వస్తున్న తీరుచూసి భక్తులు గగుర్పాటుకు గురవుతారు.మకరసంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం.

కోనసీమ ప్రత్యేకత…
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రభల తీర్థం నిర్వహించడం కోనసీమ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక్కడి సుమారు 82 చోట్ల ప్రభలతీర్థం ఘనంగా జరుగుతుంది. వీటిలో అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట, అంబాజీపేట, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, మామిడికుదురు, కొత్తపేటలలో జరిగే ప్రభల తీర్థాలు అతి పెద్దవిగా పేరొందాయి. కనుమపండుగ రోజున జరిగే జగ్గన్నతోట తీర్థానికి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 11 మంది ఏకాదశరుద్రులు తరలివస్తారు. జగ్గన్నతోటకు ఆనుకుని ఉన్న చుట్టుప్రక్కల గ్రామాలలో నెలకొన్న 11 శివాలయాలనుండి ఈశ్వరుని ఉత్సవ విగ్రహాలను ప్రభలపై జగ్గన్నతోటకు తీసుకువస్తారు.

మొసలపల్లి గ్రామానికి చెందిన భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు ఇక్కడకు పరమశివులు వస్తారని, ఇలా వచ్చే పరమశివులు లోక కళ్యాణం గురించి చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ తీర్థానికి వ్యాఘ్రేశ్వరం, పుల్లేటికుర్రు, ముక్కామల, వక్కలంక, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, నేదునూరు, ఇరుసుమండ, కె.పెదపూడి, కముజువారిలంక గ్రామాలకు చెందిన ప్రభలు వస్తాయి. వీటిలో వ్యాఘ్రేశ్వరం ప్రభ నుండి వచ్చిన వ్యాఘ్రేశ్వరస్వామి అధ్యక్షత వహిస్తారు. అందుకే ఈ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కుబడులు తీర్చకుండా వేచి ఉండడం తరతరాలుగా కొనసాగుతోంది. వ్యాఘ్రేశ్వరం నుండి వ్యాఘ్రేశ్వరం ప్రభ వచ్చినపుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి ఎత్తి దింపడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

స్థల పురాణం…
amalapuramజగ్గన్నతోట ప్రభల తీర్థానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇక్కడ స్థలపురాణం ప్రకారం విఠలాజగ్గన్న అనే ఏకసంధ్యాగ్రహి ప్రక్కనే ఉన్న కౌశికలో స్నానం చేసి పూజాదికార్యక్రమాలు నిర్వహించేవాడని పెద్దలు చెబుతారు. అప్పటినుండే ఈ ప్రాంతానికి జగ్గన్నతోటగా పేరొచ్చింది. నాడు ఆయన చేసిన పూజల ఫలితంగానే ఇక్కడ ప్రభల తీర్థం జరుగుతుందని స్థానికుల నమ్మకం. అంతేగాక 11 గ్రామాలకు ఈ తోట పొలిమేర కావడం మరో విశేషం. ఈ కారణంచేతే ఉత్తరాయణ కాలంలో ఇక్కడకు 11 గ్రామాలనుండి ప్రభలను తీసుకువచ్చి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మరో కారణంగా చెబుతారు.

సుబ్బరాజు తోటలో…
మొసలపల్లి గ్రామానికి చెందిన దంతులూరి సుబ్బరాజు అనే రైతుకు తాతలనాటినుండి సంక్రమిస్తున్న ఏడెకరాల కొబ్బరితోటలో ప్రభల తీర్థాన్ని కొనసాగించడం ఆచారంగా కొనసాగుతుంది. అంతేగాక సంప్రదాయంగా ఒకే కుటుంబానికి చెందినవారు ప్రభలను తయారు చేస్తుంటారు. తాటిశూలం, టేకుచెక్క, వెదురుబొంగులతో తయారుచేసి రంగురంగుల వస్త్రాలతో, నెమలి పింఛాలతో అలంకరిస్తారు. దేవాలయాలలో ఉండే పసిడి కుండలను, వరికంకులను ప్రభలపై ఉంచి జేగంటలుగా వ్రేలాడదీస్తారు. వివిధ గ్రామాలనుండి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చేటపుడు పంట చేల మధ్యగా, కొబ్బరితోటల మధ్యగా వ్యయప్రయాసల కోర్చి తీసుకువస్తారు.

ఇలా తీసుకువచ్చేటపుడు పంటచేలను తొక్కుతూ ఊరేగింపుగా ప్రభలను తీసుకురావడం శుభసూచకంగా భావిస్తారు. దారిలో గోతులు, గొప్పులు, ముళ్లకంచెలను దాటుకుంటూ సుమారు పదిహేను అడుగులు క్రిందకు ఉండే ఆరడుగుల నీటిలో నడుస్తూ నేర్పుగా ప్రభలను తీసుకుని రావడం మరో ప్రత్యేకత.ఎడ్లబండిపై కొబ్బరిచాపలను గూడుగా ఏర్పాటుచేసి కుటుంబసమేతంగా ఈ తీర్థానికి రావడం నేటికీ కొనసాగుతోంది.పచ్చని పంటపొలాల మధ్య గూడుబళ్లు ఒకదానివెనుక ఒకటిగా తీర్థానికి వచ్చే తీరు కన్నులపండుగగా ఉంటుంది.

రాష్ట్రం నలుమూలల నుంచి…
amalapuram3ముఖ్యంగా కోనసీమకు చెందిన వారు ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం, దూరప్రాంతాలకు వెళ్లినవారు సంక్రాంతికి నిర్వహించే ఈ తీర్థాలకు తప్పనిసరిగా తరలిరావడం విశేషం. కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్థాలన్నీ కనుమపండుగ రోజున నిర్వహిస్తుండగా కొత్తపేటలో మాత్రం సంక్రాంతి రోజున నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.ఇక్కడ ప్రభల తీర్థాన్ని చూడడం కోసం రాష్ట్రం నలుమూలలనుండి జనం తరలివస్తారు. ఇక్కడ పూర్వ కాలంనుండి కొత్తరామాలయం, పాతరామాలయం వీధుల పేరుతో గోడిపాలెంవీధి ప్రభలు పాల్గొని ప్రభుత్వ కళాశాల ఆవరణకు చేరుకున్న అనంతరం ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా మిరుమిట్లుగొలిపే బాణాసంచాలు కాల్చి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ సంబరం దీపావళిని తలపిస్తుంది. పైగా బహుమతులు ఉండడంతో స్థానికులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు.

కనువిందుచేసే సాంస్కృతిక కార్యక్రమాలు…
amalapuram2మధ్యాహ్నం ప్రభల తీర్థాలు ముగిసిన అనంతరం రాత్రి 9 గంటలనుండి అసలు సంబరాలు ప్రారంభమవుతాయి. వింతవింత విద్యుత్‌కాంతుల దీపాలమధ్య తీసుకువచ్చే ప్రభలు వివిధ నృత్యమేళాలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తూ మిరుమిట్లు గొలిపే బాణాసంచా కాల్చుతూ ఊరేగింపును జరుపుతారు.అర్థరాత్రి ఒంటి గంట సమయానికి పాత బస్టాండ్‌ సెంటర్‌ చేరుకోగానే ఒకరికి ఒకరు పోటాపోటీగా బాణాసంచా కాల్పులను ప్రారంభించి తెల్లవారుజాము 5 గంటలవరకు కొనసాగిస్తారు. సంక్రాంతి చివరిరోజైన కనుమపండుగను పురష్కరించుకుని రైతులు తమ వ్యవసాయ పనిముట్లు శుభ్రపరుచుకుని బళ్లను, ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి వీధులలో ఊరేగిస్తారు. ఈరోజున చిన్నాపెద్దా తేడాలేకుండా మొక్కుబడులు తీర్చుకుని ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు.

చెయ్యేరు ప్రభల తీర్థం…
కోనసీమలో జగ్గన్నతోట, కొత్తపేట తీర్థాల తర్వాత చెయ్యేరు ప్రభలతీర్థం మూడవస్థానం ఆక్రమిస్తుంది. ఈ తీర్థం మూడు శతాబ్థాల క్రిందట దంతులూరివారి కుటుంబం ప్రారంభించింది. అప్పటినుండి ఈ కుటుంబాల వారి చేతుల్లోనే ప్రభలతీర్థం కొనసాగడం ఆచారంగా వస్తోంది. ఈ గ్రామప్రభ కదలందే మిగిలిన గ్రామాల ప్రభలు కదలవు. ఈ ప్రభల ఉత్సవాలలో శాంతిభద్రతల పర్యవేక్షణ పోలీసులకు పెనుసవాల్‌గా మారుతోంది.క్షణకాలం తీరికలేకుండా గడుపుతున్న ఈ ఆధునిక కాలంలో తాతలనాటి ఆచారాలపేరుతో సంక్రాంతి పర్వదినాలలో కుటుంబసభ్యులంతా ఒక్కటిగా చేరి ఆనందోత్సహాలతో కాలం గడుపుతారు. పాత సంప్రదాయాలను ప్రక్కనబెట్టే నేటికాలంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలుగా ప్రభల ఉత్సవాలకు కోనసీమలో ప్రాధాన్యత కొనసాగుతుండడం విశేషం.

– రామకృష్ణ, మేజర్‌న్యూస్‌, అమలాపురం.

Surya Telugu Daily

జనవరి 14, 2011 - Posted by | సంస్కృతి

1 వ్యాఖ్య »

  1. Memu chinnappudu maa vuru lo ituvantivi chusaamu. Khammam jilla, Singareni mandalam lo, Station Karepalli dhaggara Perupally gramam lo ‘Guruvamma’ jaatara jarigedi. Prabhala dwara vellevaallam.

    వ్యాఖ్య ద్వారా Dr.LRGoje | జనవరి 18, 2011 | స్పందించు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: