హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ప్రపంచ సాహిత్యం తెలుగులో…

ప్రపంచ సాహిత్యం తెలుగులో…

ఒక జాతి మనుగడకు భాష అవసరం. భాషలేకుండా బతకడం అసంభవం. ఆ భాష సజీవంగా కొనసాగాలన్నా నిరంతరం దాని గురించి అధ్యయనం జరగాలి. అవసరాన్ని విస్తృత పరచాలి.భాష వినియోగం పెరగాలి. ఎవరికైనా విషయం మాతృభాషలోనే సులువుగా అర్థం అవుతుంది.సమగ్రంగా ఆకళింపుచేసుకొని, అవగాహనపరుచుకోవటానికి వీలవుతుంది. తెలుగు భాషను సజీవంగా ఉంచడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో పీకాక్‌ క్లాసిక్స్‌ వారు చేస్తున్నది అద్వితీయమైనది.ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు భాషలోకి తీసుకురావాలన్న వారి ధ్యేయం గొప్పది.విశ్వవిద్యాలయాలు చేయాల్సిన పనిని వీరు తమ భుజస్కంధాలపెై మోస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వంద పుస్తకాలకు పెైగా తీసుకొచ్చారు. తెలుగు భాషా ప్రేమికులంతా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Mullaప్రపంచంలోని జ్ఞాన సంపదనంతటినీ తెలుగులోకి తెచ్చుకోవాలన్న తపనే పీకాక్‌ క్లాసిక్స్‌ ఆవిర్భావానికి మూలం. పీపుల్స్‌ ట్రస్ట్‌ ప్రచురణ విభాగమే పీకాక్‌ క్లాసిక్స్‌. ప్రపంచ సాహిత్యంలో ఆణిముత్యాలు కొన్ని ఇంతకు ముందు తెలుగులోకి వచ్చాయి.స్వాతంత్య్రానికి కొంచెం ముందు ప్రారంభమై స్వాతంత్య్రం తర్వాత రెండు మూడు దశాబ్దాల పాటు ఈ క్రమం కొనసాగింది.ఎందుకో అది అక్కడ ఆగిపోయింది. ఆ దశలో నవలాలోకంలో క్లాసిక్స్‌ అనదగినవి అనేకం అనువాదమయ్యాయి. అయితే అప్పుడుగానీ, తర్వాతగానీ శాస్త్ర రంగాల్లోని మౌలిక గ్రంథాలను తెలుగులోకి తెచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ సంపూర్ణంగా జరగనేలేదు.అడపదడపా అక్కడో పుస్తకం ఇక్కడో పుస్తకం రాలేదని కాదు. ఆ పని ఒక యజ్ఞంలా మాత్రం సాగలేదు. ఇప్పుడా యజ్ఞాన్ని పీకాక్‌ క్లాసిక్స్‌ చేస్తోంది.

ఇంగ్లీష్‌ వ్యామోహం…
ఇంగ్లీష్‌ భాష బాగా నేర్చుకుంటే తప్ప ఎవరెైనా మేధా సంపన్నులు కాలేని పరిస్థితి మన దేశంలో నెలకొని ఉంది. ఈ వింత పరిస్థితి ఒక జర్మన్‌కు లేదు. ఒక రష్యన్‌కు లేదు. ఒక ఫ్రెంచి వాడికి లేదు. నార్వేని చూడండి. చిన్నదేశం. దాని జనాభా మన హైదరాబాద్‌ జనాభా అంత ఉంటుందేమో. ఒక నార్వేనియన్‌ ఆడమ్‌స్మిత్‌ని చదవా లనుకుంటే ఇంగ్లీషు నేర్చుకొని తీరాలని లేదు. టాల్‌స్టాయ్‌ని చదవడానికి రష్యన్‌ అక్కర్లేదు. ప్లేటోని చదవాలంటే గ్రీకు నేర్చుకోనక్కర్లేదు.

మార్క్‌‌సని చదవా లంటే జర్మన్‌ రానక్కర్లేదు. రామాయణం చదవడానికి సంస్కృతం అవసరం లేదు. తన మాతృభాషలోనే ఈ గ్రంథాల్ని చదువుకోగలడు నార్వేనియన్‌. అరకోటికి మించిన నార్వే ప్రజలు ఇతర భాషల్లో ఉన్న అమూల్య గ్రంథాలన్నింటినీ తమ భాషలోకి తెచ్చుకోవడం అవసరమని భావించారు.అందుకునే ఆ పనిని వారు సాధించుకున్నారు. మరి 8 కోట్ల మంది తెలుగువారికి అటువంటి అవసరం ఉండదా? ఉంటుంది కాబట్టే ఈ అవసరం కోసం నడుంబిగించింది పీకాక్‌ క్లాసిక్స్‌.

ఏయే పుస్తకాలు?
chiti-rajaప్రాచీన నాగరికతలున్న భారత్‌, చెైనా, గ్రీసు, ఈజిప్ట్‌ తదితర దేశాల ప్రాచీన గ్రంథాలు.. యూరపులో పునర్వికాసోద్యమ కాలంలో వచ్చిన మహాగ్రంథాలు… ప్రపం చాన్ని దాదాపు ఒకటిన్నర శతాబ్ధంగా తన ప్రభావంలో ముంచెత్తుతున్న మార్క్సిస్టు మౌలిక గ్రంథాలు..సమకాలీన సామాజిక, ఆర్థిక, తాత్విక, శాస్త్ర రంగాల్లో వెలువడిన ఆణి ముత్యాలు.వీటన్నింటినీ తెలుగులోకి తీసుకువస్తున్నట్టు పీకాక్‌ క్లాసిక్స్‌ ఎడిటర్‌ అన్నపనేని గాంధీ అన్నారు.వీటిని తెలుగులోకి తీసుకురావడంలో ఎన్నో సాధక బాధకాలు న్నాయన్నారు.

ఒక పుస్తకాన్ని ఎంపిక చేయడం మొదలు కొని దానిని పాఠకుని దగ్గరకు చేర్చేవరకూ మధ్యలో ఎన్నో దశలు, ఇబ్బందులు, సమస్యలున్నాయని పేర్కొ న్నారు. అయినా తాము ఎంతో మొండిగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ పనిని నిర్విఘ్నంగా చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు ప్రచురించిన పుస్తకాల పూర్తి వివరాలకు ఫోన్‌ నెంబర్లు 040-23890328, 9010204633 సంప్రదించాలని ఆయన కోరారు.

తెలుగులో…
వాల్మీకి, వ్యాసుడు, హోమర్‌, ప్లేటో, అరిస్టాటిల్‌, విష్ణుశర్మ, ఈసపు, స్మితో, రికార్డో, గెలీలియో, ఐన్‌స్టీన్‌, హాకింగ్‌, వాల్టెయిర్‌, రూసో, హాబ్స్‌, లాక్‌, మోర్గాన్‌, డార్విన్‌, మార్క్‌‌స, ఏంజిల్స్‌, కీన్స్‌, టాల్‌స్టాయ్‌, గెథే, ఫ్రాయిడ్‌, వెైల్డ్‌, గుణాఢ్యుడు, కోశాంబి, అమార్త్యసేన్‌, తిక్కన, పోతన…వంటి హేమాహేమీల రచనలన్నింటినీ పీకాక్‌ క్లాసిక్స్‌ తెలుగులో తీసుకువచ్చింది.

Surya Telugu Daily

డిసెంబర్ 15, 2010 Posted by | సంస్కృతి | | 3 వ్యాఖ్యలు