హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

తెలుగమ్మల జోల

తెలుగమ్మల జోల

కమ్మని కవితల హేల

జోలపాటలు, లాలి పాటలు మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయ. ఒక తల్లి తన శిశువుకు జోల పాడుతూ సాటిలేని అందచందాల బంగారపు బొమ్మ. అని భావిస్తూ పాప పుట్టుక బంగరు కొడవళ్ళతో కొయ్యాల్సిన బంగారపు పంటగా అభివర్ణిస్తుంది. ఇంత భావ సౌందర్యము, ధ్వని గాంభీర్యము ఉన్నాయి. ఈ రెండు పంక్తుల జోల చరణంలో…
‘ఊళ్ళోకి ఉయ్యాల లమ్మవచ్చినవి
కొడుకు, కూతుళ్ళ తల్లి! కొనవె ఉయ్యాల’
ఇద్దరు అప్పజెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా ఈ జోల చరణం. ‘మన ఊళ్ళో ఉయ్యాల మంచాలు అమ్మేవాడు వచ్చాడు. నీకు కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. ఒక ఉయ్యాల కొనుక్కోరాదుటే?’ అన్నది ఒక చెల్లెలు తన అక్కతో. ‘కొనుక్కోవాలనే ఉన్నది ఒక వెండి ఉయ్యాల. కానీ ఏమిచ్చి కొనమంటావు?’ అని అడిగింది అక్క. ‘వెండిదే మిటే? ఏకంగా బంగారందే కొనవే. మనకు మంచి పాడి సంపద ఉన్నది. పాలుపోసి కొను’ అన్నది. ఈ పాట పుట్టిన కొన్ని శతాబ్దాల కిందట వస్తు మారకపు పద్ధతి ఉండేది.
మరో తల్లి ఏడవకు ఏడవకు ఇటుల నా తండ్రి!
ఏడిస్తె నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే జూడలేను
పాలైన కార్చరా బంగారు కనుల అని
తల్లడిల్లి పోతోంది తల్లి. ‘ఏడవకురా నాన్నా! నీవు ఏడుస్తుంటే నీ కళ్ళంబడి నల్లనల్లగా కన్నీళ్ళు వస్తున్నాయి’. నీలము అంటే నలుపు. అంతేకాదు. విషము అనే అర్థం గూడా వుంది. ‘నీవు కార్చే కన్నీరు నాకు విషపుధార చూసినంత భయం పుట్టిస్తోంది. పసిపిల్లలకు కాటుక పెడతారు. అందుచేత కన్నీరు నల్లగా కారటం కూడా సహజమే.
‘ఆ నల్లని కన్నీరు చూచి భరించలేను గనుక నీ బంగారు కనులలోంచి పాలను స్రవించరా నాన్నా’ అంటున్నది ఆ అమ్మ.
‘చిట్టి ముత్యం పుట్టె సీత గర్భాన
స్వాతి వానలు గురిసె సంద్రాల మీద’ – ఒక నిర్మాలాంతఃకరణపు ఇల్లాలి భావన ఇది. బంగారుతల్లి అయిన సీతాదేవి కడుపున ఒక బాబు పుట్టాడు. ఆ శుభ సంఘటన ప్రభావంగా మరెన్నో శుభ సంఘటనలు జరిగాయట. సముద్రాలమీద స్వాతిచినుకులు పడ్డాయట. స్వాతి చినుకులు ముత్యపు చిప్పల్లో పడి ముత్యాలవుతాయి. అంటే సీత కడుపు పండటం చూసిన ప్రకృతిమాత పులకించి పరమానంద భరితురాలై మరెన్నో ముత్యాలను ప్రసవించింది అని ఒక మధురాతి మధుర మహోదాత్త ఊహ. ఒక దీపం వెలిగితే దానితో చాలా దీపాలు వెలుగుతాయి. అనే ఒక సార్వకాలిక సమాహ్లాద సంభరిత వాస్తవికతకు ఇదొక ప్రతిబింబ.
‘హాయి – ఓయు ఆపదల గాయి’ అని చాలా జోలపాటలకు ఆరంభ చరణంగా వుంటుంది. ఈ హాయి, ఓయి అనే వాటికి స్ర్తి రూపభావ వ్యక్తిత్వాలను ప్రతిక్షేపించుకుంటే – లేక ఆపాదిస్తే (పర్సానిఫికేషన్) ‘హాయమ్మ’, ‘ఓయమ్మ’ అవుతారు. చాలా ఇళ్లల్లోని తోడికోడళ్ళలాగా ఉప్పు – నిప్పుగా ఉంటాయి. ఇలా ఇందులోని మొదటి పంక్తి ఆహ్లాద జనకమయితే రెండో పంక్తి హాస్యభావ సంభరితం. ప్రతి స్ర్తికి తన పుట్టింటి వారి ప్రేమాను బంధాల మీద, ముచ్చట్ల మీద అంతనమ్మకం. అందుకే అంటుంది ‘మీ మేనమామలైతే మరిమరీ నిన్ను ముద్దాడతారు’ అని. తన పిల్లడు అంటే తల్లికి ఎంత అబ్బడమో, ఎంత ముచ్చటో తెలుసుకోవాలంటే ఈ పంక్తులు దర్పణాలుగా నిలుస్తాయి.
‘మీసాల మీదిదే రోసాల ఎఱుక
అబ్బాయి చేతిదే బంగారు గిలక’ – అని జోలపాటలో ఒక చరణం. ఈ చేష్టలు వారి పూర్వీకుల రాజసానికి సంకేతాలు. దాన్ని ఆమె గడుసుగా.
మరో ఇల్లాలు ఓయి ఓ ఇల్లాల! ఓ బాలులార!
మా బాలుడొచ్చాడ మీ తోటి యాడ?
మీ బాలుడెవ్వరో మేమెరుగ మమ్మ!
కాళ్ళగజ్జెల తండ్రి బంగారు బొమ్మ – ఇదొక సంభాషణాత్మకమైన జోలపాట చరణం. తన బాబు ఇంట్లో కనిపించటం లేదు. బుడిబుడి నడకలతో, ఇరుగుపొరుగు ఇళ్ళకు వెళ్ళాడేమో! ఇరుగింటి ఇల్లాలిని, పొరుగింటి పోరగాళ్ళను అడుగుతోంది. మీ పిల్లడెవరో మాకు తెలియదన్నారు వాళ్ళు. అప్పుడు చెప్తున్నది వాళ్ళకు ఆనవాళ్ళు. తన బాబు కాళ్ళకు గజ్జెలున్నాయట. అదొక గొప్ప. అంతేకాదు. అతగాడు బంగారు బొమ్మట. అంటే మీ కందరికన్న బాగుంటాడు అని ఘనంగా చెప్తోంది – ఇదే ఇందులోని నిసర్గమైన, అందమైన బడాయి.
‘చిన్నారి పొన్నారి చిట్టిదాసారి
దాసారి నీ మగడు దేశ దిమ్మరి’
ఇది ఒక తమాషా అయిన ఒరవడి
చాలామంది తల్లులు. తల్లి తానేమో ఒక ఇంటిపేరు వారి బిడ్డ. తన బిడ్డలేమో మరో ఇంటిపేరు వారి బిడ్డలు. ఆ ఇంటిపేరు వారు, తన ఇంటి పేరు వారు తన పెళ్ళి కారణాన పరస్పరం వియ్యాల వారైనారు. అంటే తన మామగారి ఇంటిపేరు వారందరూ తనకు బావలు, వదినలు, మరుదులు, మరదళ్ళు అవుతారు. అందుకని తన బిడ్డలను ఆటపట్టిస్తూ ఎగతాళిగా, హేళనగా మాట్లాడటం ఒక ముచ్చట. ఇది పల్లెసీమలలో ఇప్పటికీ కనిపిస్తుంటుంది. మరో తల్లి తన పిల్లాడిని ‘చిట్టీత పండెరుపు చిలుక ముక్కెరుపు తానెరుపు అబ్బాయి తనవారిలోన’ అని అంటుంది. తన కుటుంబంలో తనబాబే ఎర్రగా, బుర్రగా వుంటాడుట. ఇది దృష్టాంతాలంకారానికి ఒక మంచి దృష్టాంతం.
‘చిన్నారివే నీవు చిలకవే నీవు
చిగురు మామిళ్ళలో చిన్న కోయిలవు’ – ఇది ఇంకొక కమనీయ కవితా పంక్తి. తన పాప ఆకారంలో అందాల చిలుక. మరి కంఠం విషయంలో మామిళ్ళ చిగుళ్ళతో పసదేరిన పంచమస్వర కోకిల అంటూ తన పాపను ఆకాశానికెత్తుతోంది ఒక తల్లి ఊహల ఊయెల ఊపుల హాయితో.
ప్రత్యక్ష పద అర్థం కన్న పరోక్ష భావార్థం హృదయంగమంగా కనిపించేదానే్న ‘్ధ్వని’ అంటారు. ఈ ధ్వని అనేదే అసలు కావ్యాత్మ అంటాడు ఆనంద వర్ధనుడు తన ‘్ధ్వన్యాలోకం’ కావ్యశిల్ప శాస్త్ర గ్రంథంలో ధ్వని సిద్ధాంతానికి సలక్షణమైన, విలక్షణమైన లక్ష్యప్రాయాలుగా శాశ్వతంగా నిలిచేవి మన జోలపాటలు.
– శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం

Andhra Bhoomi.

డిసెంబర్ 12, 2010 - Posted by | సంస్కృతి

1 వ్యాఖ్య »

  1. సనారాజుగారూ!

    శ్రమతీసుకొని, ‘పండితారాధ్యుల ‘వారి వ్యాసాన్నందించినందుకు చాలా సంతోషం.

    ధన్యవాదాలు.

    వ్యాఖ్య ద్వారా కృష్ణశ్రీ | డిసెంబర్ 12, 2010 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: