హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

జానపద నజరాన చెక్కభజన

జానపద నజరాన చెక్కభజన
సంప్రదాయ ఉత్సవాలు, కార్యక్రమాలలో దేవుని ఊరేగింపు జరిపేటప్పుడు చెక్కభజన బృందం చేసే భజనలు ఆ కార్యక్రమాన్ని రక్తికట్టిస్తారుు. చెక్కభజనను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు కంచెర్ల గోపన్న. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతానికి చెందిన రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజన ప్రఖ్యాతిగాంచింది. ఇందులో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది.

janapadaluప్రకృతిలోని వస్తువులను వాడుకుని వాటి ద్వారా సంగీతాన్ని సృష్టించుకుని దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ తానే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా ఉల్లాసవంతమైన ప్రపంచంలోనికి తీసుకుపోగలగే లక్షణం ఒక్క జానపదుడికే సొంతం. ఈ లక్షణం చెక్కభజనలో కనిపిస్తుంది. కర్రముక్కలకు తాళాలు జోడించి వాటితో లయను సృష్టించడం, సామూహికంగా అడుగులు వేయడం చెక్కభజనలో కనిపించే దృశ్యం. చెక్కభజన సామూహిక నృత్యరూపం.

పండుగ, పర్వదినాల్లో, జాతరలు, ఉత్సవాలలో , సాయంకాలం ఊళ్ళో గుడిముంగిట, ఎప్పుడు పడితే అప్పుడు , ఎక్కడపడితే అక్కడ జానపదులు చెక్క భజన ప్రదర్శిస్తుంటారు. భారత రామాయణాది కథలను పాటలుగా మలచుకుని స్థానిక కళాకారులు నృత్యాలు చేస్తారు. గురువు మధ్యలో ఉంటాడు. అతను జట్టును నడిపిస్తుంటాడు. అతని ఆదేసానుసారంగా జట్టు అడుగులు వేస్తుంది. చెక్కభజనతో చేసే నృత్యంలో అడుగులు వేస్తారు. ఈ అడుగులు చాలా ఉన్నాయి. అది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్ప కొట్టడం, కులుకు వంటివి అనేకం ఇందులో ఉంటాయి. మొత్తం గుంపు ఒకే రకంగా అడుగులు వెయడం, చెక్కలు కొట్టడం మధ్యలో గురువు అరుపులు, కేకలు, ఈ ప్రదర్శనను కనులపండువగా చేస్తాయి. గురువు ఒక పాటలోని చరణం పాడితే దానిని జట్టులోని వారందరూ తిరిగి పాడతారు. ఈ పునరుక్తి వలన పాటకు అందం వస్తుంది.

భక్త రామదాసు విరచితం: చెక్కభజనను ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న. భక్త రామదాసుగా ఆయన జగద్విఖ్యాతులు. రామదాసుగా ప్రసిద్దుడైన గోపన్న కీర్తనలు భజన సంప్రదాయానికి చెందినవి. ఇప్పటికీ ఆంధ్రాప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలలో వేసిన పందిళ్లలో కొన్ని భజన బృందాలు శ్రీరామనామగానంతో, తమ చెక్కభజనలతో జనాన్ని ఉర్రూతలూగిస్తుంటారు. భజనల్లో పండరి భజన, చెక్కభజన, కులుకు భజన వంటివి అనేకం. వీటిలో చెక్కభజనలో నృత్యంకూడ ఉండడంచేత ఇది మరింత కళాత్మకతను కలిగి ఉంది.

భక్తి ఉద్యమంలో ప్రధానపాత్ర:మధ్యయుగాల్లో భారత దేశంలో వచ్చిన భక్తి ఉద్యమ ప్రభావం చెక్క భజనలో చూడవచ్చు. వేదాంతాన్ని సామాన్యులకు అందించాలన్న ఉద్దేశ్యం భక్తి ఉద్యమంలో కనిపిస్తుంది. చెక్కభజనలో కూడ వేదాంత పరమైన భారత, రామాయణ, భాగవతాది కథలను పాటల రూపంలో పామరులకు కూడ అర్థమయ్యే భాషలో చెప్పడం జరుగుతుంది. అందువల్లనే చెక్కభజన సర్వ జనాదరణీయమైంది. రాముడి గుడిలేని ఊరు లేనట్లే, అంధ్ర దేశంలో చెక్కభజన గుంపు లేని ఊరు లేదు. ప్రతి గ్రామంలోను చెక్కభజన గురువు ఉండేవాడు…అలానే చెక్కభజన గుంపు కూడా ఉండేది.

janapadalu1చెక్కభజనకు చిరునామా:చెక్కభజనకు కడప జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ ప్రతి గ్రామంలోను చెక్కల శబ్ధాలు, గురువుల కేకలు, జట్టులోని కళాకారుల అడుగుల నాదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి నుండి చాలమంది కళాకారులు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. కడప జిల్లలోని గొరిగనూరు వాసి పుల్లయ్య, చెన్నూరు వాసి ఈశ్వరరెడ్డి చెక్కభజనలో ప్రయోగాలు చేస్తున్నారు.

చెక్కభజన కూడ జానపదత్వం కోల్పోయింది. ఆధునిక ప్రసార మాధ్యమాలు టీ.వి , సినిమాలు చెక్కభజనను దెబ్బ తీస్తున్నాయి. వీటిని తట్టుకొని నిలబడడానికి ఈ కళాకారులు కూడా చెక్కభజనలో ప్రయోగాలూ చేస్తున్నారు.

నిజానికి చెక్కభజనలో కేవలం తప్పెట మాత్రమే ఉపయోగిస్తారు. అప్పుడే చెక్కభజనకు అందం వస్తుంది.మన జానపద కళారూపాలు మన సంస్కృతికి నిలువెత్తు దర్పణాలు. వాటిని కాపాడుకోకపోతే మనం సంస్కతి విధ్వంసకులమవుతాము.

భాషాభివృద్ధికి తోడ్పాటు: ఒకప్పుడు ఉత్తరాదికి పరిమితమైన దేవనాగరిలిపి దక్షిణాదికి కూడా వ్యాప్తిచెందడానికి ఈ చెక్కభజనలే కారణమంటే ఆశ్చర్యం కలగక మానదు. తుకారం, కబీర్‌, పురందరదాస్‌, మీరాభాయ్‌ వంటి ఉత్తరాది కళాకారులు తమ గీతామృతాల ద్వారా వాటి భజనల ద్వారా దక్షిణాదికి కూడా తమ భాషను వ్యాప్తినొందించారు. వారి భక్తబృందాలు ఆ రకంగా దక్షిణాదిన కూడా కొద్దోగొప్పో హిందీ భాషాభివృద్ధికి ఈ చెక్కభజనలు తోడ్పడ్డాయి.
-నండూరి రవిశంకర్‌

Surya Telugu Daily

డిసెంబర్ 10, 2010 Posted by | సంస్కృతి | 2 వ్యాఖ్యలు