హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

కృష్ణమ్మ ఒళ్లో… సరదాల విహారం..

కృష్ణమ్మ ఒళ్లో… సరదాల విహారం..

krishanmmam1 పర్యాటక రంగంలో మరో ముందడుగు! కొన్నాళ్లుగా ఊరిస్తూ వస్తోన్న ‘రివర్‌ క్రూయిజ్‌’ ప్రాజెక్టు ఇటీవలే సాకారమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థ… నాగార్జున సాగర్‌- శ్రీశైలం మధ్య బోటు ప్రయాణాన్ని చేపట్టింది. ఈ బోటు పేరు ‘ఎం ఎల్‌ అగస్త్య’. 90 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బోటు ఇటీవలే జలప్రవేశం చేసింది. రెండు రోజుల ప్యాకేజీ. ఈ బోటు ప్రయాణంతో కృష్ణమ్మ పరవళ్లు మరింత కనువిందు చేయడం ఖాయం. భారీ వర్షాల వల్ల తొణికిసలాడుతున్న కృష్ణానది ప్రవాహానికి ఎదురెళ్లడం పర్యాటకులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. చాన్నాళ్ల నుంచీ మరుగున పడి ఉన్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా చొరవతో కార్య రూపం దాల్చాయి.

krishanmmam హైదరాబాద్‌ నుంచి పర్యాటకులను నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లడానికి పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా రెండు బస్సులను నడపనుంది. శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌ లోని యాత్రీ నివాస్‌ నుంచి ఉదయం 7 గంటలకు, పాత కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఉన్న పర్యాటకాభివృద్ధి సంస్థ కేంద్రీయ రిజర్వేషన్‌ కార్యాలయం (సిఆర్‌ఓ) నుంచి 7:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. నాగార్జున సాగర్‌ చేరిన అనంతరం అక్కడి నుంచి బోటు ప్రయాణం సాగుతుంది. 90 కిలోమీటర్ల మేర ప్రయాణం. సాయంత్రానికి బోటు లింగాలగట్టుకు చేరుకుంటుంది. అనంత రం సాక్షి గణపతి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం కల్పిస్తారు. శ్రీశైలంలోని పర్యాటకాభివృద్ధి సంస్థ హోటల్‌లో రాత్రి బస. మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు ‘రోప్‌ వే’ ద్వారా పాతాళగంగకు తీసుకెళ్తారు. అనంతరం తిరుగు ప్రయాణం.

శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ చేరుకున్న తరువాత ఎత్తిపోతలు, నాగార్జున కొండ, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌, మ్యూజియం సందర్శన కల్పిస్తారు. అవి ముగిసిన వెంటనే ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ఎసి గదుల్లో నివాస వసతి పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తుంది.

టారిఫ్‌ వివరాలివీ…

హైదరాబాద్‌ నుంచి నాన్‌ ఏసీ బస్సులో…
పెద్దలకు – రూ.2000
పిల్లలకు – రూ.1500
ఏసీ బస్సులో…
పెద్దలకు – రూ.2500
పిల్లలకు – రూ.1800
నేరుగా నాగార్జున సాగర్‌లోనే బోటు ప్రయాణం చేయదల్చుకుంటే…
పెద్దలకు – రూ.1500
పిల్లలకు – రూ.1100

Surya Telugu Daily

డిసెంబర్ 7, 2010 Posted by | చూసొద్దాం | 2 వ్యాఖ్యలు